సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీల్లో పెండింగ్‌లో ఉన్న వినతులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవా రం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్‌తో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వినతులను పరిశీలించి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. అధికారులు సమన్వయంతో అర్జీలను పరిష్కరించాలని చెప్పారు.
ప్రజావాణి దరఖాస్తుల్లో కొన్ని ఇలా..
● సుజాతనగర్ మండలం గరీబ్‌పేట గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం తండాకు చెందిన లకావత్ రమేష్ తన తండ్రి మాన్య రెండేళ్ల క్రితం మృతి చెందాడని, ఆయన పేరుపై ఉన్న ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాను తన పేరుపై బదిలీ చేయాలని విన్నవించాడు.
● కొత్తగూడెం పోస్టాఫీస్ నుంచి హేమచంద్రాపురం వరకు ఉన్న భారీ లారీల రాకపోకల కారణంగా రోడ్డుపై గుంతలు ఏర్పడటంతో పాటు విపరీతమైన దుమ్ము, ధూళి వ్యాపిస్తోందని శేషగిరినగర్‌కు చెందిన లక్ష్మీదేవి వినతిపత్రం అందజేశారు. రహదారిని మెరుగుపర్చాలని, దుమ్ములేవకుండా వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని చల్లించాలని విన్నవించారు.
● ఇల్లెందులోని రెండో నంబర్ బస్తీకి చెందిన 70 ఏళ్ల మొండయ్య తన కుమారుడు మరణించినప్పటి నుంచి కోడలు, మనవడు తనను పట్టించుకోవడం లేదని, దాడులకు పాల్పడుతూ దూషిస్తున్నారని, మూడురోజులుగా భోజనం కూడా పెట్టడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. వారిపై చర్యలు తీసుకుని, తనకు రక్షణ కల్పించాలని వినతిపత్రం అందజేశాడు.
● టేకులపల్లి మండలం లక్ష్మీతండాకు చెందిన భూక్యా మంగీలాల్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు వాగును, వాగుకు ఇరువైపులా ఉన్న తమ భూమిలో కొంత భాగాన్ని ఆక్రమించుకున్నాడని, విచారణ జరిపాలని జత్య తండాకు చెందిన భూక్యా పూల్ సింగ్ విన్నవించాడు.
● కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు.
తాగునీటి భద్రతకు ప్రాధాన్యత
జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్‌లో వర్షాభావ, కరువు పరిస్థితులు ఏర్పడినా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ అంకిత్ సోమవారం తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా అశ్వాపురం మండలంలోని బీజీ కొత్తూరు పంప్ హౌస్–1 వద్ద ఖరీఫ్ 2026 సీజన్‌లో మొత్తం 1,604 గంటల పాటు భారీ మోటార్లను నిర్వహించి గోదావరి నది నుంచి 9.088 టీఎంసీల నీటిని ప్రధాన కాలువలోకి ఎత్తిపోసినట్లు కలెక్టర్ వివరించారు. వీకే రామవరం వద్ద పంప్ హౌస్–2, కమలాపురం వద్ద పంప్ హౌస్–3 ద్వారా కూడా నీటిని వివిధ ప్రాంతాలకు తరలించినట్లు తెలిపా రు. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం వల్ల జిల్లాలో తాగునీటి భద్రతకు భరోసా కల్పించడంతో పాటు 20 చెరువుల్లో నీటి నిల్వలను పెంచడం, 9,436 ఎకరాల ఆయకట్టుకు సాగునీటి భద్రత కల్పించడం, భూగర్భ జలాల పెంపునకు దోహదపడటం సాధ్యమైందని కలెక్టర్ వెల్లడించారు.
గైనిక్ సేవలు నిర్విరామంగా అందించాలి
బూర్గంపాడు: గైనిక్ సేవలు రోజూ అందాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. సోమవారం బూర్గంపాడు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, ఇన్‌పేషెంట్ వార్డులను పరిశీలించారు. అనంతరం రక్తపరీక్ష కేంద్రాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న ఆస్పత్రి భవనాన్ని కలెక్టర్ పరిశీలించి, వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రజావాణిలో కలెక్టర్ అంకిత్


