ఇల్లెందురూరల్: వృద్ధుడిని కుటుంబ సభ్యులే హతమార్చిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. మృతుడి బంధువుల కథనం ప్రకా రం.. వృద్ధుడు భూక్య శుక్లా (58) భార్య సోల్తి కలిసి వేపలగడ్డతండాలో నివా సం ఉంటున్నాడు. గతంలో గ్రామ సమీపంలో చిన్న షెడ్డు ఏర్పాటు చేసుకుని దుకాణం నిర్వహించేవాడు. కుమారుడు మృతితో దుకాణం మూసివేశాడు. ఆదివారం రాత్రి గ్రామస్తులతో కలిసి దీపావళి వేడుకల్లో గడిపాడు. అనంతరం గతంలో నిర్వహించిన దుకాణం వద్దకు వెళ్లా డు. రాత్రి తిరిగి ఇంటికి రాకపోవడంతో అక్కడే నిద్రపోయి ఉంటాడని మృతుడి భార్య భావించింది. ఉదయమే శుక్లా దుకాణంలో ఉరి వేసుకున్నాడని తెలియడంతో భార్య సోల్తితోపాటు గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. తలకు బలమైన గాయం ఉండటం, రక్తస్రావం కావడంతో అనుమానించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ వెంకన్నబాబు, సీఐ సురేష్ చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసు జాగిలం ఘటనా స్థలం నుంచి అరకిలోమీటరు దూరంలో ఉన్న వేపలగడ్డతండా గ్రామంలో శుక్లా కోడలు సోదరుడైన ధరావత్ కిషన్ ఇంటికి వెళ్లింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించి, శుక్లా మనవడు రాజేష్‌ను అరెస్ట్ చేవారు. ఇద్దరిని పోలీసుస్టేషన్‌కు తరలిస్తుండగా అడ్డుపడిన మృతుడి కోడలు వినోద తానే హత్య చేయించానని బహిరంగంగా అంగీకరించింది. దీంతో పోలీసులు ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆస్తి కోసమే కుటుంబ పెద్దనే హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితం మృతుడు శుక్లా కుమారుడు భూక్య బాలు ఆత్మహత్య ఘటన కూడా హత్యోదంతమేనని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. మృతు డి భార్య సోల్తి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ సురేష్ తెలిపారు.
కుటుంబ సభ్యులే నిందితులు


