చుంచుపల్లి: జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్‌ఎం) కింద 95 పోస్టుల భర్తీకి సోమవారం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఇందుకోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు తదితర పోస్టులను కాంట్రాక్టు, ఔసోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఈ నెల 13వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. విద్యార్హతల మార్కులకు 90 శాతం, వయసు ఆధారిత వెయిటేజీకి 10 శాతం కేటాయించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తుతోపాటు రూ. వెయ్యి డీడీ జతచేయాలని అధికారులు తెలిపారు.
దీపావళి వేడుకల్లో
వ్యక్తికి గాయాలు
గుండాల: దీపావళి వేడుకల్లో భాగంగా టపాసులు కాల్చుతున్న సమయంలో ఆరుబయట కూర్చున్న ఓ వ్యక్తికి తగిలి గాయాలైన సంఘటన ఆళ్లపల్లి మండలంలో ఆదివారం జరిగింది. ఆళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన బత్తిని శ్రీధర్ దీపావళి రోజు ఆదివారం సాయంత్ర ఆరుబయట కూర్చొని ఉన్నాడు. స్థానికులు టపాసులు కాల్చుతుండగా ఒక్కసారిగా ఓ టపాసు ఎగిరిపడి అతని వీపు భాగంలో బలంగా తగిలింది. దీంతో తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు.


