అశ్వారావుపేట, ములకలపల్లి,
దమ్మపేట మండలాల్లో కుండపోత
నీట మునిగిన పంటలు, ఉప్పొంగిన వాగులు
తెగిపోయిన రహదారులు, వంతెనలు, చెరువులు
పునరావాస కేంద్రాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు
అశ్వారావుపేట అతలాకుతలమైంది. మురసు తుపాన్ ప్రభావంతో నియోజకవర్గవ్యాప్తంగా కురిసిన వర్షం తీరని నష్టాన్ని మిగిల్చింది. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ పంటలను దెబ్బతీసింది. కుండపోత వర్షానికి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించాయి. చెరువు కట్టలు తెగిపోయాయి. రహదారులు కోతకు గురయ్యాయి. పంట చేలు నీట మునిగాయి. పత్తి, వరి, వేరుశెనగ, మినుము, మిర్చి, మొక్కజొన్న పంటలు, పామాయిల్ తోటలు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాల ఇళ్లు జలమయంగా మారాయి. దమ్మపేట, ములకలపల్లి మండల కేంద్రాలు వరదతో ముంచెత్తాయి. వాగులు ఉప్పొంగి, రహదారులు తెగిపోయి రాకపోకలు స్తంభించాయి. అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి–నల్లబాడు చెరువు ప్రధాన రహదారిపై ఆటో, ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. పలు చోట్ల వృక్షాలు విరిగిపడ్డాయి. అశ్వారావుపేటలో 27.8 సెం.మీ, ములకలపల్లిలో 23.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. మూకమామిడి ప్రాజెక్ట్ అలుగు, ఇతర ప్రాంతాల వరదతో మొగరాలగుప్ప శివారులోని పాములేరు వాగుపై వంతెన కూలిపోయింది. పలు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉండిపోయాయి. ముర్రేడు, పాములేరు ఉధృత రూపం దాల్చాయి. ములకలపల్లిలో 3 అడుగుల ఎత్తులో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్డు డివైడర్ మీదుగా వరద ప్రవహించింది. రహదారులు తెగి పాల్వంచ, అన్నపురెడ్డిపల్లి మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి. దమ్మపేట మండలంలో 16.5సెం.మీ వర్షపాతం నమోదైంది. దమ్మపేట శివారు ముంపు ప్రాంతవాసులను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పునరావాస కేంద్రానికి తరలించారు. విద్యుత్ స్తంభాలు కిందపడిపోగా వైర్లు వరద నీటిలో వేలాడాయి. ప్రధాన రహదారిపైకి భారీగా వరద నీరు చేరి దమ్మ పేటలో రాకపోకలు నిలిచిపోయాయి. ఏర్పడింది. కొత్తగూడెం, పాల్వంచ, దుమ్ముగూడెం తదితర ప్రాంతాల్లో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
–సాక్షి నెట్‌వర్క్
మురసు తుపాన్ ప్రభావంతో భారీగా వర్షాలు


