కండక్టర్ మృతిపై హత్య కేసు
ప్రయాణికులకు వెల్‌కమ్ చెప్పి..
ప్రవళిక మృతికి నిరసనగా
ఆర్టీసీ బస్సులు బంద్
డిపోల వద్ద కార్మికులు, సంఘాల నాయకుల ఆందోళన
అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికిన సహచర ఉద్యోగులు
చుంచుపల్లి/మణుగూరు టౌన్: కండక్టర్ ప్రవళికకు కన్నీటి వీడ్కోలు పలికారు. అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద గత నెల 25న మణుగూరు డిపో బస్సులో ప్రయాణికురాలు తోసేయడంతో ప్రవళిక బస్సు టైర్ల కింద పడి తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె మృతికి నిరసనగా ఆర్టీసీ కార్మికులు బుధవారం బంద్ నిర్వహించారు. కండక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలని, ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం జిల్లావ్యాప్తంగా కార్మికులు విధులు బహిష్కరించారు.
డిపో గేట్ల వద్ద నిరసనలు
భద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు ఆర్టీసీ డిపోల వద్ద కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. విధి నిర్వహణలో ఉన్న కార్మికులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మణుగూరులో మాత్రం డిపో నుంచి ఒక బస్సు కూడా కదల్లేదు. సర్వీసులు నిలిచిపోవడంతో ఆర్టీసీ భారీగా నష్టపోయింది. మణుగూరు డిపోలో 84 బస్సులు నిలిచిపోగా, రూ.15 లక్షలు, కొత్తగూడెంలో 48 బస్సులు నిలిచిపోగా రూ. 10 లక్షలు, భద్రాచలంలో 40 సర్వీసులు నిలిచిపోగా రూ. 15 లక్షలు, ఇల్లెందులో 21 సర్వీసులు నిలిచిపోగా రూ. 4 లక్షల ఆదాయాన్ని ఆర్టీసీ కోల్పోయింది.
కుటుంబానికి ప్రభుత్వం భరోసా
కండక్టర్ ప్రవళిక కుటుంబానికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున కలిపి రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా అందించడంతో పాటు, ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం మేరకు బ్యాంకు నుంచి రూ.కోటి ప్రమాద బీమా కూడా అందుతుందని వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ వద్ద ప్రవళిక పార్థివదేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి నివాళులర్పించారు. అనంతరం ఆమె తల్లిని పరామర్శించి ఆర్టీసీ కుటుంబం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని తెలిపా రు. కాగా, కొత్తగూడెం ఆర్టీసీ డిపోలో ప్రవళిక చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి, ఉద్యోగులు నివాళులర్పించినవారిలో ఉన్నారు.
మణుగూరులో ర్యాలీ
మణుగూరు డిపో ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. పట్టణంలో ఆర్టీసి జేఏసీ, ఔట్ సోర్సింగ్ కండక్టర్స్ ఆధ్వర్యంలో డిపో నుంచి వాసవీసురక్షా బస్టాండ్ మీదుగా అంబేద్కర్ చౌరాస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద మానవహారం నిర్మించారు. సీపీఐ, సీపీఎం, బీసీ సంఘం, ఎమ్మార్పీఎస్, బీజేపీ, టీయూసీఐ, ఇఫ్టూ, నాయకులు ర్యాలీలో పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపా రు. ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం నాయకుడు రాంబాబు మాట్లాడుతూ మృతురాలి తల్లికి రూ.కోటి పరిహారం, ఇన్సూరెన్స్ అత్యవసరంగా అందించాలని డిమాండ్ చేశారు. మణుగూరు డీఎస్పీ రవీంద్రరెడ్డి, సీఐ నాగబాబు, ఎస్‌ఐ నగేశ్‌లు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రత చర్యలు చేపట్టారు.
అంతిమ వీడ్కోలు
మృతదేహాన్ని బుధవారం రాత్రి మణుగూరు డిపో వద్దకు తీసుకురాగా, తోటి కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు నివాళులర్పించారు. తల్లి విజయలక్ష్మి, మహిళా కార్మికులు కన్నీరుమున్నీరయ్యారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పించారు. తల్లి విజయలక్ష్మిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎస్‌డబ్ల్యూఎఫ్(సీఐటీయూ) రాష్ట్ర, జిల్లా నాయకులు లింగమూర్తి, బాణాల రాంబాబు, గుండు మాధవరావు, వెంకటేశ్వర్లు, రోశయ్య, వెంకటయ్య, కేవి రామారావు, తాటి సుధాకర్, ఆర్‌ఎన్ రావు, రమాదేవి, శేఖర్, ఉపేందర్, ఎంప్లాయిస్ యూనియన్ నాయకులుబాబు, ఈదురు వెంకన్న, రాఘవులు, గోపాల్, అప్పారావు, సీపీఐ నాయకులు సరెడ్డిపుల్లారెడ్డి, దుర్‌ాగ్యల సుధాకర్, మున్నా లక్ష్మీకుమారి తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
ప్రభుత్వమే కారణం..
ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ నివాళులర్పించి మాట్లాడారు. ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం ప్రకటించి బస్సులను తగ్గిస్తోందని ఆరోపించారు. దీంతో విపరీతమైన ప్రయాణికుల రద్దీ పెరిగి ఇలాంటి ఘటనలు జరగడానికి ప్రభుత్వమే కారణమవుతోందని ఆరోపించారు. అనంతరం కార్మికులు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు.
అశ్వాపురం: ఆర్టీసీ కండక్టర్ గుండు ప్రవళిక(28) మృతిపై బుధవారం పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. మండల పరిధిలోని మిట్టగూడెం వద్ద గత నెల 25న మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసు బస్సులో ప్రయాణికురాలు తోసేయడంతో ప్రవళిక బస్సు టైర్ల కింద పడి తీవ్ర గాయాలపాలైంది. హైదరాబాద్ సాయిసంజీవని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ప్రవళిక మృతదేహానికి పోసుమార్టం నిర్వహించారు. ఈ నెల 25న బస్సు ప్రమాదంపై ప్రయాణికురాలు, మండల పరిధిలోని పిచుకలపాడుతండా గ్రామానికి చెందిన మౌనికపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కండక్టర్ మృతి చెందడంతో హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ఎల్లయ్య తెలిపారు.
గతంలో ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులకు స్వాగతం చెబుతూ సిబ్బందితో వీడియోలు చేయించి సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. అప్పుడు ప్రవళిక సురక్షితంగా గమ్యాన్ని చేరేందుకు ఎల్లప్పుడూ ఆర్టీసిలోనే ప్రయాణించండంటూ చేసిన వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. బస్సులోకి ప్రయాణికులకు వెల్‌కం చెప్పిన బంగారు తల్లి.. ఇక సెలవంటూ వెళ్లిపోయిందంటూ ఆర్టీసీ కార్మికులు నివాళులర్పించారు.


