కృత్తికా దీపోత్సవంలో తిరువీధి సేవ రద్దు | - | Sakshi
Sakshi News home page

కృత్తికా దీపోత్సవంలో తిరువీధి సేవ రద్దు

Nov 5 2026 1:16 AM | Updated on Nov 5 2026 1:16 AM

భద్రాచలంటౌన్‌: భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 25న నిర్వహించనున్న కృత్తికా దీపోత్సవం సందర్భంగా తిరువీధి సేవ రద్దు చేసినట్లు ఆలయ ఈఓ కె.దామోదర్‌రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ అభివృద్ధి పనుల కారణంగా తిరువీధి సేవ నిర్వహించడం లేదని, ఆలయ చుట్టుసేవ యథావిధిగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 8న దీపావళి పర్వదినం సందర్భంగా మంగళహారతులు, అభిషేకాలు తదితర పూజా కార్యక్రమాలు యథావిధిగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

11న బాలల సైన్స్‌ కాంగ్రెస్‌

కొత్తగూడెంఅర్బన్‌: జిల్లా స్థాయి జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలను ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్నట్లు డీఈఓ ఎస్‌.శంభూప్రసాద్‌ తెలిపారు. కొత్తగూడెంలోని ఆనందఖని జెడ్పీహెచ్‌ఎస్‌లో జరిగే పోటీల్లో ‘సుస్థిరత కోసం సైన్స్‌, ఆవిష్కరణలు‘ ప్రధాన ఇతివృత్తంగా విద్యార్థులు ఎగ్జిబిట్లను ప్రదర్శించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నిబంధనలు, సూచనలకు సంబంధించి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని, ఆ ఫారంతో హాజరుకావాలని, 10 – 14 ఏళ్ల విద్యార్థులను జూనియర్స్‌గా, 14 – 17 ఏళ్ల వారిని సీనియర్స్‌గా పరిగణిస్తామని తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌, మోడల్‌ పాఠశాలల నుంచి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలని సూచించారు. ఇక్కడ అర్హత సాధించే ఉత్తమ ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని, వివరాలకు జిల్లా కోఆర్డినేటర్‌, జిల్లా సైన్స్‌ అధికారి బి.సంపత్‌కుమార్‌ను సంప్రదించాలని డీఈఓ ఓ ప్రకటనలో తెలిపారు.

వైద్య కోర్సుల దరఖాస్తు గడువు పెంపు

చుంచుపల్లి: ప్రభుత్వ వైద్య కళాశాలలో రెండేళ్ల కాలపరిమితి కలిగిన వైద్య ప్రయోగశాల సాంకేతిక నిపుణుల శిక్షణ, మూత్రపిండాల శుద్ధి చికిత్స కోర్సుల్లో 30 చొప్పున సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తుల గడువును ఈ నెల 13వ వరకు పొడిగించారు. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, అవసరమైన ధ్రువపత్రాలను ప్రభుత్వ వైద్య కళాశాలలో సమర్పించాలని ప్రిన్సిపాల్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

‘ఆరోగ్య’ లక్ష్యం సాధించాలి

చుంచుపల్లి: జిల్లాలో అమలవుతున్న ప్రజారోగ్య కార్యక్రమాల లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ తుకారాం రాథోడ్‌ ఆదేశించారు. బుధవారం వైద్యాధికారులు, పర్యవేక్షకులతో నిర్వహించిన సమీక్షలో టీబీ నిర్మూలన, హెచ్‌పీవీ టీకాలు, మాతా శిశు ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. అర్హులైన టీబీ రోగులకు ఆరు నెలలపాటు నెలకు రూ.1,000 చొప్పున పోషకాహార సాయం అందించాలన్నారు.హెచ్‌పీవీ టీకాల లక్ష్యం పూర్తి చేయాలని చెప్పారు. అదనపు డీఎంహెచ్‌ఓలు, ప్రోగ్రాం అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

22న రాష్ట్ర స్థాయి

డ్యాన్స్‌ పోటీలు

ఇల్లెందు: భద్రాద్రి 24 క్రాఫ్ట్స్‌ ఆధ్వర్యంలో ఇల్లెందులో ఈ నెల 22న రాష్ట్రస్థాయి డ్యాన్స్‌ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల పోస్టర్లను బుధవారం ఇల్లెందులోని ఎంఆర్‌జీ నారాయణ పాఠశాలలో కౌన్సిలర్‌ దండు సారయ్య, విద్యావేత్త డాక్టర్‌ ఆకుల లక్ష్మి, హెచ్‌ఎం వంగూరి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళలు, కళాకారులను ప్రోత్సహించేలా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం భద్రాద్రి 24 క్రాఫ్ట్స్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కడారి వెంకటేష్‌, జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌తో పాటు శేఖర్‌, సాయి, కంకణాల రాజేష్‌ మాట్లాడుతూ ఆరు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని, విజేతలకు నగదు బహుమతులు అందిస్తామని తెలిపారు.

నేటి నుంచి కరాటే టోర్నీ

ఖమ్మం స్పోర్ట్స్‌: జిల్లా జూనియర్‌ కళాశాలల క్రీడా సంఘం ఆధ్వర్యాన రాష్ట్రస్థాయి అండర్‌–19 కరాటే పోటీలను గురువారం నుంచి నిర్వహించనున్నారు. ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయి. పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా 400 మంది బాలబాలికలు హాజరవుతారు. బరువు కేటగిరీల వారీగా నిర్వహించే పోటీల న్యాయనిర్ణేతగా గోపతి సైదులు వ్యవహరిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement