● తుపాన్ ప్రభావంతో సుమారు 20 వేల ఎకరాల్లో పంట నష్టం ● చేతికందే దశలో పంటలు చేజారిపోవడంతో రైతుల మనోవేదన
బూర్గంపాడు: మురసు తుపాన్ రైతులను ముంచింది. చేతికందే సమయంలో పంటలు దెబ్బతిన్నాయి. తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు వరి పొలాలు, మిర్చి తోటలు నేలవాలాయి. తొలివిడత దశలో ఉన్న పత్తి చేలు కూడా దెబ్బతిన్నాయి. వరి పంట నేలవాలడంతో దిగుబడిపై ప్రభావం చూపనుంది. వడ్లు రాలిపోవడం, తడిసిన పంట నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేసిన మిర్చి తోటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలుల ధాటికి పలు చోట్ల మొక్కలు నేలకొరిగాయి. పంట ఎదుగుదల, దిగుబడిపై ప్రభావం పడుతుందేమోనని రైతులు దిగులు చెందుతున్నారు. తొలివిడత తీతలు కొనసాగుతున్న సమయంలో తుపాన్ రావడంతో చేలల్లో పూసిన పత్తి నేలరాలింది. పత్తి తడిసిపోవడంతో నల్లబడి ధర తగ్గే అవకాశం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
20 వేల ఎకరాల్లో పంట నష్టం
మురసు తుపాను ప్రభావంతో జిల్లాలో సుమారు 20 వేల ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు అంచనా. వరి, మిర్చి, పత్తి, మొక్కజొన్న పంటలు ప్రధానంగా దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే సమయంలో నష్టం జరగడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, నష్టం అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం పంట నష్టానికి పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎంతో ఆశతో మిర్చి సాగు చేసి, వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టాను. కానీ మురసు తుపాన్ మా ఆశలపై నీళ్లు చల్లింది. భారీ వర్షాలు, ఈదురుగాలులతో పంటంతా దెబ్బతిన్నది. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి.
–పాండవుల దర్గయ్య రైతు,టేకుల చెరువు


