● ●తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసిన సింగరేణి ● ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తు గడువు విధించిన యాజమాన్యం
రుద్రంపూర్/గోదావరిఖని: సింగరేణి సంస్థలో గైర్హాజర్ పేరుతో తొలగించిన కార్మికులను మళ్లీ విధుల్లోకి తీసుకునేందుకు యాజమాన్యం అంగీకరించింది. ఈమేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. గైర్హాజరు కారణంగా 2023 నుంచి 2025 వరకు తొలగించిన ఉద్యోగుల కేసులను తిరిగి పరిశీలించాలని నిర్ణయించింది. ఇందుకోసం హైపవర్ కమిటీని ఏర్పా టు చేసింది. 2023 జనవరి 1 నుంచి 2025 డిసెంబర్ 31 మధ్య గైర్హాజరుతో తొలగించినవారు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి 46ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసు కలిగి ఉండాలని పేర్కొంది. ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క కోల్‌బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధులతో సమావేశం సందర్భంగా డిస్మిస్డ్ ఉద్యోగులకు మళ్లీ ఉద్యోగ అవకాశం కల్పించాలని విన్నవించిన నేపథ్యంలో ఈ అంశాన్ని పరిశీలించాలని సింగరేణినిని ఆదేశించారు.
ఇవీ నిబంధనలు
● తొలగించిన కాలానికి ముందున్న ఐదేళ్లలో ఏవైనా రెండేళ్లు కనీసం 100 మస్టర్లు పూర్తిచేసి ఉండాలి.
● జనరల్ అసిస్టెంట్ ట్రెయినీ అండర్‌గ్రౌండ్, కేటగిరీ–1 పోస్టులో పునర్ నియామకానికి వైద్యపరంగా ఫిట్‌గా ఉండాలి.
● అర్హత కలిగిన డిస్మిస్డ్ ఉద్యోగులు ప్రొఫార్మాలో దరఖాస్తు పూరించి చివరగా పనిచేసిన గని/డిపార్ట్మెంట్ అధికారికి సమర్పించాలి.
● దరఖాస్తు సమర్పణకు ఈ నెల 14న చివరి తేదీగా నిర్ణయించారు.
● ఏరియా జీఎంలు అభ్యర్థుల దరఖాస్తులను పరిశీ లించి, తదుపరి చర్యల నిమిత్తం నిర్ణీత తేదీలోగా సంబంధిత అధికారులకు పంపించాలి.
● పూర్తివివరాల కోసం సంబంధిత గనులు లేదా శాఖల అధికారులను సంప్రదించాలి.


