పెద్దమ్మతల్లికి విశేష పూజలు | - | Sakshi
Sakshi News home page

పెద్దమ్మతల్లికి విశేష పూజలు

Nov 2 2026 12:17 AM | Updated on Nov 2 2026 12:17 AM

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు క్యూలైన్‌ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

నేడు బహిరంగ వేలంపాట

పెద్దమ్మతల్లి ఆలయంలో సోమవారం ఉదయం 11 గంటల నుంచి బహిరంగ వేలంపాటలు నిర్వహించనున్నట్లు ఈఓ ఎ.విజయ్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు ఏసీ ఫంక్షన్‌ హాల్స్‌, కొత్త కాంప్లెక్స్‌లోని 1,2,3,5,6,7,8,10,12 నంబర్‌ షాపులు, పాత కాంప్లెక్స్‌లోని 1వ నంబర్‌ షాపు, ఫొటోలు తీసుకునేందుకు లీజు, పూలదండలు విక్రయానికి లైసెన్స్‌ హక్కులు పొందేందుకుగాను సీల్డ్‌ టెండర్‌ కం బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లు వివరించారు.

వెండి శఠారి బహూకరణ

మణుగూరు రూరల్‌: మండలంలోని గుట్టమల్లారం గ్రామపంచాయతీలో ఉన్న శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయానికి చిట్టూరి శేషుకుమార్‌–నాగరత్నమణి దంపతులు వెండి శఠారిని బహూకరించారు. శేషుకుమార్‌ తన పుట్టినరోజు సందర్భంగా సుమారు రూ.1.20 లక్షల విలువైన 500 గ్రాముల వెండి శఠారిని స్వామివారికి సమర్పించారు. దాతలను ఆలయ కమిటీ చైర్మన్‌ దోసపాటి నాగేశ్వరరావు తదితరులు అభినందించారు.

నేడు ప్రజావాణి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు ఉదయం 10గంటలకు హాజరుకావాలని కలెక్టర్‌ అంకిత్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై లిఖితపూర్వక దరఖాస్తులను అందజేయాలని సూచించారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో, అన్ని మండల ప్రజా పరిషత్‌ కార్యాలయాల్లో కూడా ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు.

గిరిజన దర్బార్‌..

భద్రాచలంటౌన్‌: భద్రాచలం ఐటీడీఏలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్‌, సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలోని ప్రజావాణి కార్యక్రమాలకు అన్ని శాఖల అధికారులు ఉదయం 10.30 గంటలకు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్‌, సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ఠ ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై లిఖితపూర్వక ఫిర్యాదులు అందజేయాలని సూచించారు.

కిన్నెరసానిలో జలవిహారం

పాల్వంచరూరల్‌: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం సందడి నెలకొంది. రాష్ట్రంలోని పలుప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్‌, జలాశయం, డీర్‌ పార్కులోని దుప్పులను వీక్షించారు. 367 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా రూ.19,925, సఫారీ ద్వారా రూ.3,200 ఆదాయం వైల్డ్‌లైఫ్‌ శాఖకు లభించింది. 200 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్‌ సంస్థకు రూ.9,620 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.

భారీగా తగ్గిన

ఆయిల్‌పామ్‌ గెలల ధర

అశ్వారావుపేట: అక్టోబర్‌ నెలలో తెలంగాణలోని ఆయిల్‌పామ్‌ గెలల ధర భారీగా తగ్గింది. ఫ్యాక్టరీలకు రైతుల తరలించిన గెలల టన్ను ధర రూ.22,658గా తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ నిర్ణయించింది. సెప్టెంబర్‌లో తరలించిన గెలల టన్ను ధర రూ. 23,641 ఉండగా రూ.983 తగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement