గోదావరికి హారతి
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీసేవగా మిథిలా స్టేడియం ప్రాంగణంలోని రామసేవా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. సెలవు రోజు కావడంతో నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రామాలయానికి రూ.40 వేల కార్పెట్లు వితరణ
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి హైదరాబాద్ ఒయాసిస్ ఆస్పత్రి డాక్టర్ కృష్ణచైతన్య – హరిత దంపతులు రూ.40 వేల విలువైన కార్పెట్లను ఆదివారం అందజేశారు. గతంలో కలర్ ప్రింటర్ కూడా అందజేసిన దాతలు, ఇప్పుడు కార్పెట్లను ఆలయ ఈఓ కే.దామోదర్‌రావు, ఏఈఓ శ్రావణ్‌కుమార్‌కు అందించాక స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దాతలకు అధికారులు స్వామివారి ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో గొర్ల వెంకటేశ్వరరావు, కడాలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
భద్రాచలం గోదావరి స్నానఘట్టాల వద్ద ఆదివారం గోదారమ్మకు ప్రత్యేక నదీహారతి సమర్పించారు. గణపతి పూజ, దీపోత్సవం, అష్టోత్తర శతనామార్చన అనంతరం హారతి సమర్పించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. భద్రాద్రి పురోహితుల సంఘం అధ్యక్షుడు రామవజ్జల రవికుమార్, పురోహితులు సత్యప్రసాద్ శర్మ, రామాచార్యులు, తిరుపతిరావు, తేజశర్మ తదితరులు పాల్గొన్నారు.


