గిరిజన దంపతులకు
ఘన సత్కారం
భక్తి భావంతో శబరి స్మృతి యాత్ర
ఫల, పుష్పాంజలితో మురిసిన
మూర్తులు
గిరిజన సంప్రదాయ నృత్యాలతో
పులకించిన భద్రగిరి
భద్రాచలం: శబరి భక్తినీ, సీతారాముల కరుణను స్మరించుకుంటూ భద్రగిరిలో సోమవారం చేపట్టిన శబరి స్మృతి యాత్ర వైభవంగా సాగింది. శబరి చిత్రపటానికి ఫల, పుష్పాంజలి సమర్పించి, భక్తి ప్రపత్తులతో రామయ్యను కొలుస్తూ గిరిజనులు ఆధ్యాత్మిక తన్మయత్వం పొందారు. గిరిజనులను ముందుగానే ప్రత్యేక ఆర్టీసీ బస్సుల్లో భద్రాచలానికి తీసుకొచ్చి వసతి సదుపాయాలు కల్పించారు. తొలుత శబరి చిత్రపటాన్ని మేళతాళాల నడుమ, భక్తుల జయజయధ్వానాలతో, శ్రీరామ నామస్మరణతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. గిరిజనుల సంప్రదాయ నృత్యాలు, భక్తజనుల శ్రీరామ నామ స్మరణలతో శోభాయాత్ర సాగుతుండగా భద్రగిరి పురవీధులు ఆధ్యాత్మిక కళ సంతరించుకున్నాయి. శోభా యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భక్త రామదాసు విగ్రహానికి పూలమాల వేసి హారతి సమర్పించారు. అనంతరం దమ్మక్క విగ్రహం వద్ద పూలు, పండ్లు సమర్పించి భక్తితో నమస్కరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన గిరిజనుల సంప్రదాయ నృత్యాలు, కోలాటాల సందడితో భద్రాచల వీధుల్లో సందడి నెలకొంది.
సీతారాముల సన్నిధిలో ఫల, పుష్పాంజలి
మిథిలా స్టేడియంలోని రామసేవా మండపంలో కొలువుదీరిన స్వామివారి ఉత్సవమూర్తుల సన్నిధి లో శబరి స్మరణ కార్యక్రమం నిర్వహించారు. గిరిజ నులు భక్తిశ్రద్ధలతో వివిధ రకాల పండ్లు, పుష్పాలను సమర్పించగా ఆలయ అర్చకులు పుష్పాంజలి నిర్వహించారు. సీతారాముల దివ్యమంగళ రూపాలను దర్శించుకుంటూ గిరిజనులు తన్మయత్వానికి లోనయ్యారు. అనంతరం స్వామివారి నిత్యకల్యాణోత్సవాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణ మహోత్సవంలో గిరిజ నులు పాల్గొని సీతారాముల దివ్యకల్యాణాన్ని కనులారా వీక్షించి భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
శబరి స్మృతి యాత్రలో పాల్గొన్న గిరిజనుల ఆధ్యాత్మిక అనుబంధాన్ని గౌరవిస్తూ ఎమ్మెల్యే వెంకట్రావు, దేవస్థానం ఈఓ దామోదర్‌రావులు గిరిజన దంపతులకు వస్త్రాలు సమర్పించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు భవాని రామకృష్ణ, శ్రావణ్‌కుమార్, భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణ, ఆలయ ప్రధాన అర్చకులు విజయరాఘవన్, కోటి రామ స్వరూప్, ఆలయ అర్చకులు, పండితులు, గిరిజన పెద్దలు, వివిధ గ్రామా ల నుంచి వచ్చిన గిరిజనులు, భక్తులు పాల్గొన్నారు. శబరి స్మృతి యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని వరరామచంద్రాపురం పరిధిలో శబరి నది తీరాన కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం అర్చకులు నదీ జలాలతో శబరి విగ్రహానికి అభిషేకం చేశాక, రామయ్య తరఫున తీసుకెళ్లిన వస్త్రాలతో అలంకరించి హారతి, నైవేద్యాలు సమర్పించారు.


