పాల్వంచరూరల్: పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో చండీహోమం నిర్వహించారు. ముందుగా మేళతాళాలు, వేదమంత్రాలతో స్వామి వారిని అర్చకులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం మండపారాధన, గణపతిపూజ చండీహోమం చేశారు. చివరన పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియ గడువులోగా పూర్తి చేయాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఓటరు దరఖాస్తుల పరిష్కారం, సంబంధిత రికార్డుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్ నుంచి సోమవారం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతి, ఓటరు దరఖాస్తుల పరిష్కారం, శాసనమండలి నియోజకవర్గ ఓటరు నమోదు తదితర అంశాలపై సమీక్షించారు. క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అంకిత్ హాజరయ్యారు.
1న ఎన్‌ఎంఎంఎస్
ప్రవేశ పరీక్ష
కొత్తగూడెంఅర్బన్: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్‌ఎంఎంఎస్) ప్రవేశ పరీక్ష నవంబర్ 1న ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి డీఈఓ ఎస్.మాధవరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగూడెంలోని బాబూ క్యాంప్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, చుంచుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సింగరేణి ఉన్నత పాఠశాల, సెంట్‌మేరీ ఉన్నత పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 845 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. హెచ్‌ఎంలు ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసి, సంతకం, స్కూల్ స్టాంప్ ముద్రవేసి విద్యార్థులకు అందజేయాలని తెలిపారు. వివరాలకు 99890 27943 నంబరులో సంప్రదించాలని కోరారు.
ఉపాధి పనులు సద్వినియోగం చేసుకోవాలి
టేకులపల్లిరూరల్: ఉపాధి (వీబీ జీ రామ్‌జీ)పనులను సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ డీఆర్‌డీఓ నల్లమోతు రవి సూచించారు. సోమవారం ఆయన మండలంలోని సర్వాయిబోడు, సిద్దారం గ్రామాలను సందర్శించారు. గొత్తి కోయలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉపాధి పనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒక్కొక్కరు 125 రోజులపాటు పని చేయవచ్చని తెలిపారు. చేలలో ఫారం పాండ్, చెరువు పూడిక తీత పనులు సహా 375 రకాల పనులను చేసుకోవాలని, ప్రతి ఇంటికి మరుగు దొడ్డి, ఇంకుడు గుంత నిర్మించుకోవాలని పేర్కొన్నారు. అనంతరం గొత్తి కోయలకు జాబ్ కార్డులు మంజూరు చేశారు. సర్పంచులు మెట్ల తులశమ్మ, ఇర్ప రుక్మిణి, ఉప సర్పంచ్ కొర్సా చుక్కమ్మ, డీఆర్‌డీఏ ఏపీడీలు విజయ భాస్కర్‌రెడ్డి, రమణ, రాజు పాల్గొన్నారు.
78మంది కండక్టర్ల సర్వీసు క్రమబద్ధీకరణ
ఖమ్మంమయూరిసెంటర్: ఆర్‌టీసీ ఖమ్మం రీజియన్‌లో బ్రెడ్ విన్నర్ స్కీమ్, మెడికల్ ఇన్‌వ్యాలిడేషన్ స్కీమ్ ద్వారా కన్సాలిడేటెడ్ పేపై నియమితులైన కండక్టర్ల సర్వీసును క్రమబద్ధీకరిస్తూ రీజినల్ మేనేజర్ ఏ.సరిరామ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ఆగస్టు 12వ తేదీ నుంచి వర్తించనున్నాయని పేర్కొన్నారు. ఖమ్మం రీజియన్‌లోని వివిధ డిపోల్లో పనిచేస్తున్న 78 మంది కండక్టర్ల సర్వీసు క్రమబద్ధీకరించగా, వీరిని వేతన స్కేల్‌లోకి మారుస్తూ, నిబంధనల ప్రకారం సాధారణ అలవెన్సులు, ఇతర సౌకర్యాలు కల్పించనున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఏడాది పాటు ప్రొబేషనరీ అమల్లో ఉండనుండగా, క్రమబద్ధీకరణ ఉత్తర్వులపై కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.


