● తుపాన్ నేపథ్యంలో జిల్లాకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ● వరికోత, పత్తితీతల తరుణంలో పంటలు దెబ్బతినే అవకాశం
బూర్గంపాడు: అర్నబ్ తుపాను రైతులను కలవరపెడుతోంది. వాతావరణశాఖ జిల్లాకు రెడ్ అలెర్ట్ ప్రకటించడంతోపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. వరికోతలు, పత్తితీత షురువైన తరుణంలో తుపా ను హెచ్చరికలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది పంటల సాగు రైతులకు కత్తిమీద సాములా మారింది. వర్షాభావ పరిస్థితులతో పంటలను కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. ఎండల తీవ్రత, నీటి ఎద్దడి పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపింది. గుడ్డిలో మెల్లలాగ వరి, పత్తికి మార్కెట్‌లో ధర ఆశాజనకంగా ఉంది. దిగుబడులు తగ్గినా ధరలు ఆశాజనకంగా ఉన్నాయనే ఆనందంలో ఉన్న రైతులను అర్నబ్ తుపాను ఆందోళనకు గురిచేస్తోంది. బుధవారం నుంచి రెండురోజులపాటు జిల్లాలో తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ సూచిస్తోంది. గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు వస్తున్నాయి.
1.70లక్షల ఎకరాల్లో వరిసాగు
జిల్లాలో ఈ ఏడాది సుమారు 1.70లక్షల ఎకరాలలో వరిసాగు చేశారు. వర్షాలు సరిగా కురవక, చెరువులు నిండక, బోర్లలో నీరు రాక రైతులు నానా అవస్థలతో వరిసాగు చేశారు. కరెంట్ కోతలతో కొన్ని ప్రాంతాలలో డీజిల్ ఇంజన్లు, జనరేటర్లు పెట్టి పంటను కాపాడుకున్నారు. నీరు అందక కొన్ని గ్రామాలలో పంటలు ఎండిపోయాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వరికోతలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం వరికి క్వింటాకు(పచ్చివి) రూ.3200 వరకు ధర పలుకుతోంది. కోసిన ధాన్యం కోసినట్లే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తెరవకముందే ధాన్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. తుపాను కారణంగా వరికోతలు నిలిచిపోయే పరిస్థితులున్నాయి. కోతకు వచ్చిన వరి తుపానుకు నేలవాలుతుందని, చేతికి వచ్చిన పంట దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
2.20 లక్షల ఎకరాల్లో పత్తి..
ఈ ఏడాది జిల్లాలో 2.20లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పత్తి చేలు ఏపుగా పెరగలేదు. దిగుబడులు గణనీయంగా తగ్గుతాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం తొలివిడత పత్తితీతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎకరాకు రెండు నుంచి మూడు క్వింటాళ్ల పత్తి రైతుల చేతికి రాగా, కూలీల కొరతతో పత్తితీతలు ఆలస్యమవుతున్నాయి. ప్రస్తుతం క్వింటాకు రూ. 9వేల వరకు పలుకుతోంది. సీసీఐ పత్తి కొనుగోళ్లు ప్రారంభించక ముందే వ్యాపారులు, జిన్నింగ్ మిల్లుల నిర్వాహకులు రైతుల వద్ద నుంచి పత్తిని కొనుగోలు చేస్తున్నారు. ఈ తరుణంలో తుపాను హెచ్చరికలు పత్తిరైతు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. వర్షాలు కురిస్తే పూసిన పత్తి నేలరాలుతుందని, రంగు మారుతుందని కలవరపడుతున్నారు.


