తరతరాల బంధం! | - | Sakshi
Sakshi News home page

తరతరాల బంధం!

Oct 18 2026 12:18 AM | Updated on Oct 18 2026 12:18 AM

పూలతోనే పండుగ బైరెడ్డి కుటుంబం.. మూడు తరాలు నూతి కుటుంబం.. నాలుగో తరం సంప్రదాయం.. కడవెండి కుటుంబం

బతుకమ్మతో మహిళల మురిపెం

జీవనవిధానంలో మార్పులు వచ్చినా

ఆనవాయితీ మరువని ఆడబిడ్డలు

ఖమ్మంగాంధీచౌక్‌: తెలంగాణ సంస్కతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ నిలుస్తోంది. ఉత్తర తెలంగాణకు దీటుగా ఏపీకి సరిహద్దుగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆడబిడ్డలు సైతం బతుకమ్మ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. కొన్నిచోట్ల తరాలుగా బతుకమ్మ ఆడుతుండగా.. ఇంకొన్ని ప్రాంతాల్లో తెలంగాణ ఉద్యమం సమయం నుంచి పండుగ జోరందుకుంది. అయితే, నేటి ఉరుకులు, పరుగుల జీవనంలో కూడా బతుకమ్మ విశిష్టతకు ముందు తరాలకు అందిస్తు న్న ఆడపడుచులు పండుగ సంప్రదాయం కొనసాగేలా పాటుపడుతున్నారు.

దాదాపు అన్ని పండుగలు, పూజల్లో పూలు వినియోగించడం ఆనవాయితీ. కానీ పూలనే పూజించే ఏకై క పండుగ బతుకమ్మ! తొమ్మిది రోజుల పాటు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చే ఆడబిడ్డలు తమ ఇళ్లలో ఆటపాటలతో పండుగ జరుపుకుంటారు. పూర్వీకుల నుంచి తరతరాలుగా ఈ పండుగను సంప్రదాయబద్ధంగా కొనసాగిస్తుండడం విశేషం. అత్తాకోడళ్లు, తల్లీకుమార్తెలు, మనవరాళ్లు ఒకచోటకు చేరి బతుకమ్మలు పేర్చడం, వాటి చుట్టూ ఆడిపాడడం కుటుంబ ఐక్యత, అనుబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. బతుకమ్మ అంటే పూలను పేర్చడమే కాక ప్రకృతిని ఆరాధించడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, కుటుంబ బంధాలను బలోపేతం చేసుకోవడమనే నానుడిని నిజం చేస్తున్న కొన్ని కుటుంబాలు పరిచయం..

భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం ముకుందాపురం ఆంజనేయపురానికి చెందిన బైరెడ్డి కుటుంబం పూర్వీకుల నుంచి బతుకమ్మ వేడుక జరుపుకుంటోంది. బైరెడ్డి సులోచన, ఆమె కోడలు రమాదేవి బతుకమ్మ ఆడగా.. కొన్నేళ్ల నుంచి సులోచన మనవరాలు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన ప్రీతిరెడ్డి కూడా వీరికి జత కలవడంతో సంబురానికి కొత్తదనం వచ్చినట్లయింది.

బతుకమ్మ పండుగను సంప్రదాయంగా జరుపుకుంటున్న మరో కుటుంబం అశ్వారావుపేటకు చెందిన నూతి చెన్నమ్మ కుటుంబం. కూతురు బుచ్చమ్మ, మనవరాలు విజయ, ముది మనవరాలు గాయత్రి.. ఇలా నాలుగు తరాల వారితో బతుకమ్మ జరుపుకోవడం ఆనందంగా ఉందని చెన్నమ్మ సంతోషంగా చెబుతున్నారు. ఏటా బతుకమ్మ పండుగ వేళ ఇంట్లో సందడి ఉంటుందని వెల్లడించారు.

ఖమ్మంలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ కొత్త కార్యాలయానికి సమీప ఓ అపార్టుమెంట్‌లో నివసించే కడవెండి కుటుంబం తరాలుగా బతుకమ్మను జరుపుకుంటోంది. పూర్వీకులు అందించిన పండుగను సంప్రదాయానికి అనుగుణంగా జరుపుకుంటున్నారు. ఈ కుటుంబానికి చెందిన సుబ్బరత్నం, అరుణకుమారి, సాయి పూజిత, హంసిక ఇలా మూడు తరాలు వేడుకలో పాల్గొంటున్నాయి.

నేడు సద్దుల బతుకమ్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement