సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా
యంత్రాలను తీసుకెళ్లనివ్వం..
● పెండింగ్లో 350 మంది ఓబీ కార్మికుల పీఎఫ్, వేతనాలు ● బకాయి ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తోందని కార్మికుల ఆవేదన ● సింగరేణి కేఓసీలోని ఎల్ఎస్ఎన్ ఓబీ కంపెనీ తీరుపై ఫిర్యాదు
టేకులపల్లిరూరల్: కోయగూడెం ఓసీలో ఓబీ కంపెనీ కార్మికులకు వేతనాలు, పీఎఫ్ చెల్లించకుండా తాత్సారం చేస్తోంది. రూ. 4 కోట్ల బకాయి చెల్లించకుండానే యంత్రాలను ఇక్కడి నుంచే తరలించేందుకు ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. సింగరేణి ఇల్లెందు ఏరియా టేకులపల్లి మండలంలోని కోయగూడెం ఓసీలో బొగ్గు, ఓబీ (ఓవర్ బర్డెన్) తీసే మూడు సంవత్సరాల టెండర్ పనులను ఎల్ఎస్ఎన్ కంపెనీ దక్కించుకుంది. ఈ ఏడాది నవంబర్తో టెండర్ ముగియనుంది. సుమారు 350 మంది కార్మికులు ఓబీలో పని చేస్తున్నారు. పీఎఫ్ చెల్లించేందుకు ఒక్కో కార్మికుడి వేతనం నుంచి నెలకు రూ.1500 నుంచి రూ. 1800 వరకు కంపెనీ కోత విధించింది. అంతే మొత్తం కలిపి ప్రతీ కార్మికునికి నెలనెలా ఈపీఎఫ్ చెల్లించాల్సి ఉంది. కానీ సుమారు 18 నెలలుగా యాజమాన్యం పీఎఫ్ చెల్లించడంలేదు. గత ఆగస్టు నెల జీతం కూడా పెండింగ్లో ఉంది. సగటున ఒక్కో కార్మికునికి రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు కంపెనీ బకాయి చెల్లించాల్సి ఉంది.
కార్మికుల ఆందోళన బాట
కంపెనీ మోసాన్ని పసిగట్టిన కార్మికులు ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఆందోళన బాట పట్టారు. తమకు న్యాయం చేయాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, సింగరేణి జీఎం, ప్రాజెక్టు ఆఫీసర్, ఇతర అధికారులు, పోలీసు అధి కారులు సీఐ, ఎస్ఐలకు వినతిపత్రాలు అందజేశారు. స్పందించిన సింగరేణి సంస్థ, ఎల్ఎస్ఎన్ కంపెనీకి చెల్లించాల్సిన బకాయి బిల్లుల్లో రూ.8 కోట్లను నిలిపివేసింది. మరోవైపు బకాయిలు పూర్తిగా చెల్లించే దాకా యంత్రాల ను కదలనివ్వబోమని కార్మికులు, యూనియన్ నాయకులు తేల్చి చెప్పారు. దిగివచ్చిన కంపెనీ గత నెల 30వ తేదీ లోపు బకాయిలు చెల్లించేందుకు అంగీకారం కుదుర్చుకుంది. గడువు ముగిసినా చెల్లించలేదు. పైగా గుట్టు చప్పుడు కాకుండా యంత్రాలు, ఇతర సామగ్రిని తరలించుకుపోయేందుకు 5 భారీ ట్రాలీలను ఓసీకి తీసుకొచ్చింది. దీంతో కార్మికులు ఆగ్రహం చెంది కంపెనీ ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఓసీలో ఎల్ఎస్ఎన్ కంపెనీ యాజమాన్యానికి, ఓబీ కార్మికుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నా యి. కాగా, ఈ సమస్యపై ఎల్ఎస్ఎన్ కంపెనీ ప్రతినిధిని వివరణ కోరగా.. త్వరలో బకాయిలు చెల్లిస్తామని తెలిపారు. చెల్లింపులు పూర్తయ్యాకే ఇక్కడి నుంచి కంపెనీ సామగ్రి తీసుకెళ్తామని పేర్కొన్నారు.
రుద్రంపూర్: వేతన, పీఎఫ్ బకాయిలు చెల్లించాలని కోరుతూ కార్మికులు శనివారం జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని సింగరేణి ప్రధానకార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎల్ఎస్ఎన్ కంపెనీ బకాయిలు చెల్లించాలని చర్యలు తీసుకోవాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు రాసుద్దీన్ డిమాండ్ చేశారు. జేఏసీ నాయకులు వంగా వెంకట్, ఎన్.సంజీవ్, బ్రహ్మాచారి, డి. ప్రసా ద్, యాకూబ్షావలి, దేవరకొండ శంకర్, జి.వీరస్వామి, క్రిష్టాఫర్, ఏఎస్ నబీ, భుక్యా రమేష్, పాయం వెంకన్న, పెద్దబోయిన సతీష్ తదితరులు పాల్గొన్నారు.
చెమటోడ్చి పనిచేసిన 350 మంది కార్మికులకు ఎల్ఎస్ఎన్ కంపెనీ రూ.4 కోట్ల వరకు ఈపీఎఫ్ బకాయిలు చెల్లించాలి. అవి ఎగ్గొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు కంపెనీకి సంబంధించిన యంత్రాలను తీసుకెళ్లనివ్వం.
–డి.ప్రసాద్, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకుడు


