● బహిరంగ మార్కెట్లో మద్దతు ధర మించి పత్తి రేటు ● క్వింటాల్కు రూ. 9 వేలతో రైతుల ఇళ్ల వద్దే కొనుగోళ్లు ● ఎల్నినో ప్రభావంతో వర్షాల్లేక తగ్గుతున్న పంట దిగుబడి
బూర్గంపాడు: ప్రతికూల పరిస్థితులతో పత్తి దిగుబడులు తగ్గాయని దిగులు చెందుతున్న రైతులకు మార్కెట్ ధరలు ఒకింత ఊరటనిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను మించి ప్రస్తుతం కొనుగోళ్లు జరుగుతున్నా యి. జిల్లాలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రా రంభించక ముందే ప్రైవేటు వ్యాపారులు కొనుగోళ్లు ముమ్మరం చేశారు. రైతుల ఇళ్ల వద్దకే వచ్చి కొంటున్నారు. క్వింటాల్కురూ. 9 వేల వరకు చెల్లిస్తున్నారు.
2.10 లక్షల ఎకరాల్లో సాగు
ఎల్నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు పత్తిపంటపై తీవ్ర ప్రభావం చూపాయి. జిల్లాలో ఈ ఏడాది సుమారు 2.10 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో కురిసిన అడపాదడపా వర్షాలు పంటకు జీవం పోశాయి. కాపు దశలో ఉండగా తుపాన్ ప్రభావంతో సెప్టెంబర్ మొదటివారంలో కురిసిన వర్షాలకు పూత, పిందె రాలిపోయాయి. ఆ తర్వాత వర్షాలు లేకపోవడంతో పత్తిచేలు వడబడుతున్నాయి. దీంతో దిగుబడి సగానికి పడిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెలలో వర్షాలు పడితేనే కొంతమేర దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది.
తొలివిడత తీత
పదిరోజుల నుంచి తొలివిడత పత్తి తీతలు మొదలుకాగా, ఎకరాకు 2 నుంచి 3 క్వింటాళ్ల వరకు పత్తి చేతికందుతోంది. దసరా ముందే వ్యాపారులు, జిన్నింగ్ మిల్లుల నిర్వాహకులు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. నాలుగేళ్లుగా బహిరంగ మార్కెట్లో పత్తి ధర ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువగానే పలికింది. దీంతో రైతులు సీసీఐ కేంద్రాల్లోనే విక్రయించారు. ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
క్వింటాకు మద్దతు ధర రూ.8,667
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పత్తికి క్వింటాకు రూ.8,667 మద్దతు ధరను ప్రకటించింది. కపాస్ యాప్లో రైతులు ముందుగా విక్రయాలకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. అనంతరం ట్రాక్టర్లలో పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాలి. ఇందుకు క్వింటాకు రూ. 200 వరకు ఖర్చవుతుంది. అక్కడ సీసీఐ బయ్యర్లు తేమశాతం, నాణ్యతను పరిశీలించి ధర నిర్ణయిస్తారు. ఈ ఏడాది బహిరంగ మార్కెట్లో పత్తికి మంచి ధర పలుకుతుండటంతో రైతులకు సీసీఐకి తీసుకెళ్లే ఖర్చులు తగ్గనున్నాయి. కాగా, రానున్న రోజులలో పత్తికి క్వింటాకు రూ.10 వేల వరకు రేటు వస్తుందనే ప్రచారం సాగుతోంది. దీంతో కొందరు రైతులు పత్తి విక్రయించకుండా నిల్వ చేస్తున్నారు. ధరలు ఇదేవిధంగా కొనసాగితే ఈ ఏడాది సీసీఐ పత్తి కొనుగోళ్లకు బ్రేక్ పడనుంది.


