బతుకమ్మకు సొబగులు ! | - | Sakshi
Sakshi News home page

బతుకమ్మకు సొబగులు !

Oct 18 2026 12:18 AM | Updated on Oct 18 2026 12:18 AM

● ఒకప్పుడు తంగేడు, గునుగు, అల్లీ పూలకే అగ్రస్థానం ● సాగులో వచ్చిన మార్పులతో తగ్గిన తంగేడు పూలు ● ఆ స్థానంలో బంతి, చామంతి, గులాబీలు ● అందుబాటులోకి రెడీమేడ్‌ బతుకమ్మలు కూడా..

తంగేడు కనుమరుగు

విధిలేక కొనుగోలు

ఊరు చివరే దొరికేవి

● ఒకప్పుడు తంగేడు, గునుగు, అల్లీ పూలకే అగ్రస్థానం ● సాగులో వచ్చిన మార్పులతో తగ్గిన తంగేడు పూలు ● ఆ స్థానంలో బంతి, చామంతి, గులాబీలు ● అందుబాటులోకి రెడీమేడ్‌ బతుకమ్మలు కూడా..

అందరి పండుగ

సాక్షి ప్రతినిది, భద్రాద్రి కొత్తగూడెం/ఇల్లెందురూరల్‌: ఒకప్పుడు ఎక్కువగా ఉత్తర తెలంగాణకే పరిమితమైన బతుకమ్మ పండుగ ఇప్పుడు ఎల్లలు దాటింది. ఆంధ్రా ప్రభావం ఎక్కువగా ఉండే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ఏజెన్సీ, అశ్వారావుపేట వంటి చోట్ల కూడా బతుకమ్మ ఆడుతున్నారు. మరోవైపు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రతీరోజు బతుకమ్మ ఆడుతున్నారు. ఈక్రమాన బతుకమ్మలు పేర్చడం, పాటల్లోనే మార్పులు వచ్చాయి. పాతవైన తంగేడు స్థానాన్ని బంతి పూలు భర్తీ చేస్తుండగా సంప్రదాయ ఒక్కేసి పువ్వేసి సందమామ అనే పాటల స్థానంలో యూ ట్యాబ్‌ జానపద గేయాలు మార్మోగిపోతున్నాయి.

తగ్గిన తామర

మిషన్‌ కాకతీయ, ఆ తర్వాత వచ్చిన చేపల పెంపకంతో చెరువుల్లో తామర, అల్లి, లిల్లీ పువ్వులు కూడా తగ్గిపోయాయి. గతంలో మిర్చి, వరి తదితర పంటలను కీటకాల బారి నుంచి కాపాడుకుంనేందుకు పొల్లం గట్ల వెంబడి రంగురంగుల్లో ఉండే గునుగు పూలను రైతులు పెంచేవారు. పురుగుల మందులు వాడకంతో గునుగు చెట్ల పెంపకం కూడా తగ్గింది. కాలక్రమంలో ఊళ్లు, ఇళ్ల నుంచి టేకుచెట్లు మాయమై దట్టమైన అడవులకే పరిమితం అయ్యాయి. ఫలితంగా ఒకప్పుడు ఉచితంగా లభించిన తంగేడు, గునుగు, తామర పువ్వులు డబ్బులు పెట్టి కొనాల్సిన పరిస్థితి వచ్చింది. దట్టమైన అడవులు విస్తరించిన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, కుమురంభీం అసిఫాబాద్‌ వంటి జిల్లాల్లో కొంత మేర గునుగు పువ్వులు లభిస్తున్నప్పటికీ మిగిలిన జిల్లాల్లో ఈ పరిస్థితిలేదు.

కొత్త పువ్వులు వచ్చాయి

కర్ణాటకలోని హోసూరు, కోలార్‌, చిగ్‌బళ్లాపూర్‌, ముల్‌భాగల్‌ తదితర ప్రాంతాలు పూల తోటల పెంపకాలకు ప్రసిద్ధి చెందాయి. ప్రతీ రోజు అక్కడి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు పదుల టన్నుల సంఖ్యలో పువ్వులు దిగుమతి అవుతున్నాయి. శుభకార్యాలు, పూజలు, ప్రారంభోత్సవాలకు ఈ పూలను విరివిగా ఉపయోగిస్తున్నారు. దీంతో దాదాపు అన్ని పట్టణాల్లో పువ్వుల విక్రయకేంద్రాలు వచ్చాయి. బంతి కేజీ వంద నుంచి ప్రారంభం అవుతుండగా చామంతి కేజీ రూ.350గా లభిస్తున్నాయి. ఇలా వచ్చిన బంతి, చామంతి, గులాబీ పూలు క్రమంగా సంప్రదాయ తంగేడు, గునుగు, టేకు, అల్లి పూల స్థానాలను భర్తీ చేస్తున్నాయి.

రెడీమేడ్‌ బతుకమ్మలు

ఆదరణ పెరిగిపోవడంతో మార్కెట్‌లో రెడీమేడ్‌ బతుకమ్మల విక్రయాలు కూడా సాగుతున్నాయి. అడుగు నుంచి ఆరు అడుగుల ఎత్తు వరకు వెదురుతో బతుకమ్మ డిజైన్లు తయారు చేస్తున్నారు. ఇవి అడుగుకు రూ.50 నుంచి రూ.900 వరకు దొరుకుతున్నాయి. వీటితో పాటు పూలను కొనుగోలు చేసి కొందరు మహిళలు ఇంటి దగ్గర బతుకమ్మలు పేరుస్తున్నారు. మరికొన్ని చోట్ల రెడీమేడ్‌ బతుకమ్మనే పూల విక్రయ కేంద్రాల్లో అమ్మతున్నారు. రూ.750 నుంచి రూ.5వేల ధరల్లో బతుకమ్మలు ఆర్డర్లపై తయారు చేస్తున్నారు.

కొత్తగూడెంలో అమ్మకానికి పూలు

మొగ్గలతోనే అమ్ముతున్న తంగేడు

వెదురు అల్లకంతో బతుకమ్మ పేరుస్తున్న మహిళలు

ఒకప్పుడు తెలంగాణలో బీడు భూములు ఎక్కువగా ఉండేవి. వాటిలో తంగేడు పూలు విరగబూసేవి. ఈ పూలనే బతుకమ్మను పేర్చడంలో ప్రధానంగా ఉపయోగించే వారు. ముందు పెద్దవిగా ఉండే తామర లేదా బీర ఆకులను అమర్చి వాటిపై తంగేడు ఆకులు, పువ్వులు పేర్చుకుంటూ వెళ్లేవారు. మధ్య మధ్యలో ఆకర్షణ కోసం గనుగు పూలు, టేకు పూలు, తామర, అల్లి పూలను అమర్చేవారు. బతుకమ్మపై పసుపు ముద్దతో చేసిన గౌరమ్మ ఉంచేవారు. ఉచిత కరెంట్‌, సాగునీటి లభ్యత పెరగడంతో తెలంగాణలో వ్యవసాయం ఊపందుకుంది. క్రమంగా రెండు పంటలు పండించే భూములు పెరిగాయి. అటవీ హక్కుల చట్టం రాకతో పోడు భూములకు పట్టాలు వచ్చాయి. ఇలా వ్యవసాయంపై మక్కువ పెరగడంతో క్రమంగా బీడు భూములు తగ్గిపోయాయి. దీనికి తోడు తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఊపందుకున్న రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌తో ఖాళీ స్థలాలు, శివారు ప్రాంతాలు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లుగా మారాయి. ఫలితంగా తంగేడు చెట్లు క్రమంగా కనుమరుగై పోతున్నాయి.

ఏటా తొలకరి సమయంలోనే ఇంటి పెరడులో పూల మొక్కలు నాటుకునేవాళ్లం. పండుగ సమయానికి అవి విరగపూసేవి. నేడు కోతులు మొక్కలను పెరగనివ్వడం లేదు. అయినా బతుకమ్మపై ప్రేమతో పూలు కొనుగోలు చేస్తున్నాం.

– మోకాళ్ల పూర్ణిమ, ఒడ్డుగూడెం,

ఇల్లెందు మండలం

బతుకమ్మ పండుగకు అవసరమైన సంప్రదాయ పూలన్నీ గతంలో ఊరు చివరన ఉండే అడవుల్లో దొరికేవి. పండుగకు ఒక రోజు ముందే వెళ్లి తంగేడు, గునుగు పూలను సేకరించేవాళ్లం. నేడు ఎంత దూరం వెళ్లినా కనిపించడం లేదు.

– వల్లాల మంగమ్మ, సుభాష్‌నగర్‌,

ఇల్లెందు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement