నాడు కంబాలపాడు..
నేడు చప్టా దిగువ..
వేగంగా సాగుతున్న రామాలయ, భద్రాచలం అభివృద్ధి పనులు
గోదావరి నుంచి వచ్చే చప్టా దిగువ రోడ్డు 57 అడుగులకు విస్తరణ!
ఒక వైపు ప్రభుత్వ స్థలం కావడంతో పరిహారం చెల్లింపుపై సందిగ్ధం
రెండో పక్క నరసింహాలయం వైపే భూసేకరణకు అధికారుల మొగ్గు?
భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి, గోదావరి పుష్కరాల నేపథ్యంలో భద్రాచల పట్టణంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. గోదావరి ఘాట్ నుంచి రామాలయానికి వచ్చే చప్టా దిగువ రోడ్డును 57 అడుగులకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఇది సుమారు 42 అడుగుల వెడల్పుతో ఉంది. విస్తరణకు అవసరమైన భూసేకరణపై అధికారులు ఇటీవల సర్వే పూర్తి చేసి నిర్వాసితులను గుర్తించినట్లు సమాచారం. అయితే రోడ్డుకు రెండు వైపులా భూమిని సేకరించాలా.. లేక ఒకవైపే సేకరించాలా? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. దీనికితోడు భూ యజమానులకు నష్టపరిహారం చెల్లింపు, ప్రభుత్వ భూమిలో ఉన్న నిర్మాణాల విషయంలో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
ప్రభుత్వ భూమికి పరిహారం ఎలా?
రామాలయం నుంచి గోదావరి ఘాట్‌కు వెళ్లే చప్టా దిగువ రోడ్డుకు ఎడమవైపున కొన్ని లాడ్జీలు, వ్యాపార సముదాయాలు ఉన్న భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ సర్వే నంబర్‌గా నమోదై ఉన్నట్లు సమాచారం. అదే నిజమైతే ఆ భూమికి నష్టపరిహారం చెల్లించే అవకాశం ఉండదని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే తరుణంలో అక్కడ ఉన్న లాడ్జీలు, ఇతర వ్యాపార సముదాయాలను తొలగించడం, స్థలం స్వాధీనం చేసుకోవడం అధికారులకు సవాలుగా మారనుంది. దీంతో రోడ్డుకు ఒకవైపు.. యోగానంద లక్ష్మీనరసింహాలయం వైపు భూసేకరణ చేపడితే సమస్యను పరిష్కరించవచ్చనే ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ వైపున భూనిర్వాసితుల సంఖ్య ఎక్కువగా ఉండటంతోపాటు పరిహారం కూడా భారీగా కోరుతున్నట్లు సమాచారం. దీంతో వ్యవహారం స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. కలెక్టర్ స్థాయిలో నిర్ణయం తీసుకున్న అనంతరమే భూసేకరణ, రోడ్డు విస్తరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
బొబ్బల నరసింహాలయం వైపే మొగ్గు?
రోడ్డును ఇరువైపులా విస్తరించి 57 అడుగులకు తీసుకెళితే మరింత విశాలంగా మారే అవకాశం ఉంది. చప్టా దిగువన ఉన్న పురాతన యోగానంద లక్ష్మీనరసింహాలయం అభివృద్ధికి కూడా రోడ్డు విస్తరణ కీలకంగా మారనుంది. ప్రస్తుతం చుట్టూ ఉన్న వ్యాపార సముదాయాల కారణంగా ఆలయం పూర్తిగా కనిపించడంలేదు. గతంలో ‘బొబ్బల నరసింహుడు’గా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న అనంతరం రామయ్యను దర్శించుకునే సంప్రదాయం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఆలయానికి అడ్డుగా ఉన్న నిర్మాణాలను తొలగిస్తే యోగానంద లక్ష్మీనరసింహాలయానికి పూర్వవైభవం తీసుకురావొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గోదావరిలో పుణ్యస్నానం, బొబ్బల నరసింహుడి దర్శనం, అనంతరం సీతారాముల దర్శనం భక్తులకు మరింత సౌకర్యవంతంగా మారే అవకాశం ఉంది. దీంతో రోడ్డు విస్తరణను నరసింహాలయం వైపు చేపట్టే అంశానికే అధికారులు, ప్రజాప్రతినిధులు మొగ్గు చూపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో భూసేకరణ, నష్టపరిహారం అంశాలపై త్వరితగతిన నిర్ణయం తీసుకుని పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. పుష్కరాల నాటికి చప్టా దిగువ రోడ్డు విస్తరణ పూర్తయితే భక్తులకు రాకపోకలు సులభతరం కానున్నాయి. గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో రోడ్డు విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.
భద్రాచలం అభివృద్ధి చెందక ముందు గోదావరి నుంచి లాంచీల ద్వారా వచ్చే భక్తులు చప్టా దిగువ రోడ్డు మీదుగా రామాలయానికి చేరుకునేవారు. ఆ సమయంలో దేవస్థాన అధికారులు, సిబ్బంది ఈ ప్రాంతంలోనే నివాసం ఉండేవారు. అప్పట్లో ఈ నివాస ప్రాంతాన్ని కంబాలపాడుగా పిలిచేవారు. కాలక్రమంలో భద్రాచలం పట్టణం విస్తరించడంతో రోడ్డుకు ఇరువైపులా లాడ్జీ లు, బొమ్మల దుకాణాలు, ఇతర వ్యాపార సముదాయాలు వెలిశాయి. ఆక్రమణలు కూడా పెరిగాయి. దీంతో ప్రస్తుతం రోడ్డు విస్తరణకు భూసేకరణ ప్రధాన సమస్యగా మారింది.


