పెద్దపండుగగా పేరున్న దసరాను తెలంగాణలో ఘనంగా జరుపుకుంటారు. బొడ్డెమ్మ, బతుకమ్మ ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఇంటి మహాలక్ష్ములైన ఆడబిడ్డలు పుట్టింటికి తప్పకవస్తారు. విద్యా సంవత్సరం తొలి త్రైమాసిక పది రోజుల సెలవులు ఇదే సమయంలో వస్తాయి. దీంతో రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. జిల్లా నలుమూలల నుంచి హైదరాబాద్‌కు, కోల్‌బెల్ట్ ప్రాంతాలైన కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరుల నుంచి బెల్లంపల్లి వరకు వేల మంది వచ్చిపోతుంటారు. సెలవులు మొదలయ్యే ఈ నెల 10 నుంచి పండుగ అనంతరం వరకు 50 వేల మందికి పైగా రాకపోకలు సాగిస్తారని అంచనా.
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందులలో ఆర్టీసీ డిపోలు బస్సులు ఉన్నాయి. సూపర్ లగ్జరీ, లహరి, రాజధాని, డీలక్స్ వంటి ప్రైమ్ బస్సులకు తోడుగా ఎక్స్‌ప్రెస్ బస్సులు కూడా రాష్ట్ర రాజధానికి నడిచేవి. సెలవులు సమీపిస్తున్న తరుణంలో ఉన్నట్టుండి నాలుగు డిపోల నుంచి హైదరాబాద్ వైపు నడిచే ఎక్స్‌ప్రెస్‌లకు ఆర్టీసీ మేనేజ్‌మెంట్ కోత పెట్టింది. కొత్తగూడెం డిపో నుంచి ఏకంగా సూపర్ లగ్జరీ, రాజధాని సర్వీసులు పూర్తిగా రద్దు చేసింది. జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే భద్రాచలం, మణుగూరు, భెల్, పరిగి డిపోల నుంచి నడిచే 33 సర్వీసులే అందుబాటులో ఉన్నాయి. ఈ మొత్తం సర్వీసుల్లో కలిసి రోజూ 1,268 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దసరా సమయంలో ఉండే డిమాండ్‌కు ఈ సీట్లు సరిపోవు. ఇక ఎక్స్‌ప్రెస్ బస్సులు పూర్తిగా రద్దు చేయడంతో జిల్లా నుంచి మహాలక్ష్మి పథకం ఉపయోగించే అవకాశాలు మహిళలకు చాలా వరకు తగ్గిపోయాయి.
దసరా పండగ డిమాండ్‌కు తగ్గట్టుగా కొత్తగూడెం (భద్రాచలంరోడ్) నుంచి బెల్లంపల్లి వైపు, హైదరాబాద్ వైపు ప్రత్యేక రైళ్లు నడిపించే విషయంలో రైల్వేశాఖ అనాదిగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోంది. సంక్రాంతి పండుగ తరహాలో ఈ సమయంలో కూడా ఆంధ్రాలోని కాకినాడ, నర్సాపూర్, తిరుపతిలకు 24 జతల ప్రత్యేక రైళ్లను ఇప్పటికే ప్రకటించింది. ఎక్కడో ఉన్న బెంగళూరు, హౌరా, పట్నా, వడోదరలకు కూడా స్పెషల్ ట్రైన్స్ వేస్తోంది. డిమాండ్ లేక వాటిలో ఇప్పటికీ బెర్తులు నిండటంలేదు. కానీ దసరాకు తీవ్ర డిమాండ్ ఉండే కోల్‌బెల్ట్ ఏరియాలకు రాష్ట్ర రాజధాని నుంచి ఒక్క ప్రత్యేక రైలు కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు. ఆఖరికి ఉదయం నుంచి సాయంత్రం వరకు సికింద్రాబాద్ యార్డులో ఖాళీగా ఉండే మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రేక్‌లను పండుగ సమయంలో రద్దీ కోసం ఉపయోగించడంపైనా దృష్టి పెట్టడం లేదు.
పండుగ రద్దీ పెరిగితే అప్పటికప్పుడు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడిపించడం పరిపాటి. కానీ, ప్రత్యేక బస్సులంటే అదనపు చార్జీలు తప్పనిసరి వ్యవహారం. మహాలక్ష్మి పథకం వినియోగించుకుంటున్న మహిళల పొదుపు ఖాతాలకు ఈ ప్రత్యేక బస్సులు, ప్రీమియం కేటగిరీ బస్సులు చిల్లులు పెట్టడం ఖాయం. ఆర్టీసీ, రైల్వే నుంచి దసరా రద్దీకి తగ్గట్టు సర్వీసులు లేకపోవడంతో ఈ అవకాశం వినియోగించుకునేందుకు ప్రైవేట్ సెక్టార్ సిద్ధమైంది. జిల్లా కేంద్రం నుంచి రోజూ 29 బస్సులు హైదరాబాద్‌కు నడుస్తున్నాయి. ఇందులో ప్రీమియం ఏసీ, స్లీపర్ క్లాస్ విభాగాల్లో చార్జీల పెరుగుదల ఇప్పటికే మొదలైంది. కొన్ని కంపెనీలు ఒక్క టికెట్‌కు రూ. రెండు వేల వరకు చార్జ్ చేస్తున్నాయి. రాబోయే వారం రోజుల్లో ఇది మరింత తీవ్రం కానుంది.
అయితే ఈసారి ప్రయాణంలో ప్రయాసలు తప్పేలా లేవు. రద్దీకి తగ్గట్టుగా ప్రజా రవాణా వ్యవస్థలు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టడంలేదు. ఆర్టీసీ కొత్త సర్వీసులు ఏర్పాటు చేయకపోగా ఉన్నవాటినే రద్దు చేసింది. ఇక రైల్వేశాఖ ఎప్పటిలాగే ప్రత్యేక రైళ్ల ఊసే ఎత్తడంలేదు. వెరసి దసరా సెలవుల్లో ప్రయాణం ఇబ్బందికరంగా మారనుంది. ఇదే అదునుగా ప్రైవేటు ట్రావెలర్ల చార్జీల పేరిట దోచుకోనున్నారు.


