పత్తి రైతు విలవిల | - | Sakshi
Sakshi News home page

పత్తి రైతు విలవిల

Oct 3 2026 12:20 AM | Updated on Oct 3 2026 12:20 AM

తుపాను దెబ్బతో చేజారిన పంట

మొక్కలు నీరుసిచ్చుబడి రాలుతున్న పూత, పిందె

నాలుగు రోజుల వర్షాలకు నల్లబడి కుళ్లుతున్న కాయలు

బూర్గంపాడు: వారం, పది రోజుల్లో పత్తి చేతికందుతుందనే రైతుల ఆశలపై తుపాను నీళ్లు చల్లింది. నాలుగు రోజులపాటు కురిసిన వర్షాలకు పంట దెబ్బతిన్నది. పూత, పిందె నేలరాలుతోంది. పక్వానికి వచ్చిన కాయలు వర్షానికి నల్లబడి కుళ్లిపోతున్నాయి. ఎకరాకు మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల వరకు పత్తి చేజారిపోయిందని రైతులు వాపోతున్నారు. మొక్కలు నీరుసిచ్చుబడి ఎండిపోతున్నాయి. పత్తి దిగుబడులపై ఆశలు పెట్టుకున్న రైతులు ప్రస్తుత పరిస్థితిని చూసి ఆందోళన చెందుతున్నారు.

అడపాదడపా కురిసిన వర్షాలతో..

ఎల్‌నినో పరిస్థితులతో ఈ ఏడాది జూన్‌, జూలై, ఆగస్టు నెలల్లో జిల్లావ్యాప్తంగా ఒకింత తక్కువగానే వర్షాలు కురిశాయి. అయితే పత్తి పంట సాగుకు మాత్రం అడపాదడపా కురిసిన వర్షాలు అనువుగా మారాయి. జిల్లాలో ఎక్కువగానే 2.20 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. ఈ ఏడాది కూలీల రేట్లు పెరిగాయి. ఎరువుల ధరలకు రెక్కలు వచ్చాయి. గతేడాది కాంప్లెక్స్‌ ఎరువుల బస్తా ధరకు ఈ ఏడాది అదనంగా రూ.1000 పైగా రేటు పెరిగింది. ఎరువులు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయాల్సి రావటంతో చాలామంది రైతులు ఇబ్బందులు పడ్డారు. ఎకరాకు ఇప్పటివరకు రూ.60వేల నుంచి రూ.70వేల వరకు పెట్టుబడులు పెట్టారు. దసరా పండుగకు ముందుగానే పత్తి చేతికందుతుందని రైతులు ఆశపడ్డారు. ఇంతలోనే తుపాను దెబ్బతో పత్తి పంటకు నష్టం వాటిల్లింది.

ధర ఆశాజనకంగా ఉన్నా..

ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో పత్తి ధర క్వింటాకు రూ.8500 నుంచి రూ.9వేల వరకు పలుకుతోంది. ధర ఒకింత ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది అప్పుల నుంచి గట్టెక్కుతామని రైతులు భావించారు. అక్టోబర్‌లోనే సీసీఐ పత్తి కొనుగోళ్లకు సన్నాహాలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే ఈ ఏడాది పత్తికి బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధర వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో వచ్చిన తుపాను ప్రభావంతో రైతులు ఒక్కసారిగా రైతులు దిగాలు పడ్డారు. దెబ్బతిన్న పత్తిచేలకు మళ్లీ వేలాది రూపాయల పెట్టుబడి పెడితేనే కాపునకు వస్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాఖ పరిశీలించాలని, ప్రభుత్వం పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

నేలరాలిన

పూత, పిందె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement