చండ్రుగొండ: మండలంలోని మద్దుకూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్ గార్ అజీవికా గ్రామీణ్ మిషన్ గ్రామసభలో అధికారులను గ్రామస్తులు నిలదీశారు. పలు సమస్యలు ఏకరువు పెట్టారు. ఇందిరమ్మ ఇళ్లను రాజకీయ నాయకులు ఇళ్లలో కూర్చొని రాస్తున్నారని, అధికారులు సైతం అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. దీంతో సభకు హాజరైన అధికారులు గ్రామస్తులను సముదాయించారు. కాగా, తొలుత సభలో అడిషనల్ కలెక్టర్ విద్యాచందన మాట్లాడుతూ రైతులు వ్యవసాయ భూముల్లో తప్పనిసరిగా ఫారం పాండ్లు నిర్మించుకోవాలని, తద్వారా ఎల్‌నినో ప్రభావం వల్ల వచ్చే నీటి కొరత, భూగర్భ జలాల కొరతను అధిగమించవచ్చని వివరించారు. ఎంపీడీఓ అశోక్ మాట్లాడుతూ గుడిసెలు ఉన్నవారికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. గ్రామసభలో ఆమోదించిన పనులు మాత్రమే వీబీ జీరామ్ జీ పథకంలో చేపడతామని తెలిపారు. సర్పంచ్ కొడెం కృష్ణవేణి, గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, ఉప సర్పంచ్ శ్రావణ్ కుమార్, ఎంపీఓ ఖాన్, జీపీ సెక్రటరీ కృష్ణకుమారి, ఏపీఓ శ్రీనివాస్, టీఏ రాము, ఎఫ్‌ఏ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


