నిఘా.. కమాండ్‌! | - | Sakshi
Sakshi News home page

నిఘా.. కమాండ్‌!

Oct 3 2026 12:20 AM | Updated on Oct 3 2026 12:20 AM

● కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో నిరంతరం పర్యవేక్షణ ● పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో అనుసంధానం ● క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తుండటంతో సత్ఫలితాలు ● అక్రమ కలప రవాణాను అడ్డుకునేందుకు అటవీశాఖ ప్రయత్నం

పటిష్ట పర్యవేక్షణ

● కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో నిరంతరం పర్యవేక్షణ ● పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో అనుసంధానం ● క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తుండటంతో సత్ఫలితాలు ● అక్రమ కలప రవాణాను అడ్డుకునేందుకు అటవీశాఖ ప్రయత్నం

చుంచుపల్లి: అటవీప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న కలపను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పట్టేస్తోంది. గతనెల 10న మర్కోడు సమీపంలో ఎద్దుల బండిపై 30కలప దిమ్మెలను తరలిస్తుండగా అధికా రులు స్వాధీనం చేసుకున్నారు. 23న దమ్మపేట మండలం అంకంపాలెం బీట్‌లో టాస్క్‌ఫోర్స్‌ రూ. 7.05లక్షల విలువైన 5.235 ఘనపు మీటర్ల టేకు కలపను పట్టుకుంది. ఈ రెండు సందర్భాల్లోనూ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ అప్రమత్తం చేయడంతో అధికారులు కలపను పట్టుకోగలిగారు. కీలక అటవీ ప్రాంతాలు, కలప అక్రమ రవాణాకు అవకాశం ఉన్న మార్గాలపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించి అటవీశాఖ 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. దీంతో సత్ఫలితాలు వస్తున్నాయి.

క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తూ..

జిల్లాలో అటవీ విస్తీర్ణం 2,861.66 చదరపు కిలో మీటర్లు ఉండగా, 608 మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. విస్తారమైన అటవీ ప్రాంతం, అనేక గ్రామాలు, అటవీ మార్గాల నేపథ్యంలో కలప అక్రమ రవాణాను అడ్డుకోవడం సిబ్బందికి సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో గస్తీ నిర్వహిస్తున్నా కమాండ్‌ సెంటర్‌ నుంచీ నిఘా కొనసాగిస్తున్నారు. అనుమానాస్పద కదలికలను గుర్తించి గస్తీ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.

వివిధ ప్రాంతాల్లో 35 కెమెరాల ఏర్పాటు

జిల్లాలోని కీలకప్రాంతాల్లో 35సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి నిరంతర పర్యవేక్షణలో ఉంచారు. కొత్తగూడెం సెంట్రల్‌ పార్క్‌లో నాలుగు కెమెరాలు, సంపత్‌నగర్‌, మొండికట్ట, గట్టుమళ్ల చెక్‌పోస్టు వద్ద, మర్కోడు, ఉలవనూరు ప్రాంతాల్లో ఒక్కోటి, కిన్నెరసాని డీర్‌ పార్క్‌ పరిధిలో మూడు, వనవిహార్‌ ప్రాంతాల్లో ఒక్కోటి ఏర్పాటు చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా కెమెరాలు ఏర్పాటు చేసినా భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు వివరాలు వెల్ల డించడం లేదు. ఈ కెమెరాలన్నీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానమై ఉండగా, 11 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తూ అనుమానాస్పద కదలికలను గుర్తించి క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. కెమెరాలను జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్‌ సింగ్‌ మొబైల్‌ లాగిన్‌కు కూడా అనుసంధానించారు. దీంతో ఆయనకూడా ఎప్పటికప్పు డు పర్యవేక్షిస్తున్నారు. ఇక ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో 24 గంటలూ ఫోన్‌ అందుబాటులో ఉంటుంది. వెరసి నిరంతర నిఘాతో అక్రమ కలప రవాణాకు చెక్‌ పెట్టేందుకు అటవీశాఖ గట్టి ప్రయత్నం చేస్తోంది.

(కేంద్ర అటవీ స్థితి నివేదిక–2023 ప్రకారం జిల్లా, అటవీ విస్తీర్ణం చ.కి.మీ.లలో)

జిల్లా విస్తీర్ణం: 6,985.69

మొత్తం అటవీ విస్తీర్ణం 2,861.66

దట్టమైన అడవి: 637.34

మధ్యస్థ అడవి: 1,502.71

బహిరంగ అడవి: 721.61

సీసీ కెమెరాలను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించి నిఘా పటిష్టం చేశాం. అటవీ సంపదను అక్రమంగా తరలించే ప్రయత్నాలను అడ్డుకునేందుకు సాంకేతిక నిఘా, క్షేత్రస్థాయి గస్తీని సమన్వయం చేస్తున్నాం. అడవుల పరిరక్షణలో ప్రజలు కూడా తమకు తెలిసిన సమాచారాన్ని అటవీశాఖకు అందించాలి. – సిద్ధార్థ విక్రమ్‌ సింగ్‌, డీఎఫ్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement