● వృద్ధుల వయసు మార్చి నకిలీ ఆధార్ సృష్టి ● వారి పేరిటే వాహనాల కొనుగోలు ● రుణమాఫీతోపాటు పరిహారం స్వాహా!
ఇల్లెందురూరల్: మండలంలోని మారుమూల ప్రాంతానికి చెందిన గ్రామపంచాయతీలో ఓ తల్లికి ఇద్దరు కుమారులు. ఆమె వృద్ధాప్య పింఛన్ పొందుతుండగానే చిన్నకుమారుడు ఆమె ఆధార్‌లో వయసు మార్చి ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించడంతోపాటు, ఆమె పేరిట ఓ వాహనం కూడా కొనుగోలు చేశాడు. వృద్ధాప్యంతో ఆ తల్లి మృతి చెందింది. దీంతో ఇన్సూరెన్స్, వాహనానికి రుణమాఫీ మంజూరు దశలో ఉన్న విషయం తెలుసుకున్న పెద్దకుమారుడు ప్రయోజనంలో తనకూ వాటా ఇవ్వాలని పట్టుబట్టాడు. ఇరువురి ఫిర్యాదుతో గ్రామపెద్దలు పంచాయితీ నిర్వహించాల్సి వచ్చింది. దశాబ్దం క్రితం బతికున్న వారి పేరిట డెత్ సర్టిఫికెట్లు పొంది ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించుకున్న ఘటనలు వెలుగు చూడగా.. ఇటీవల ఆధార్‌లో వయసు మార్చి ఇన్సూరెన్స్ కొల్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
సులువుగా వయసు మార్పు
సాధారణంగా ఆధార్‌కార్డులో పేరు, వయసు మార్పు విషయంలో అనేక నిబంధనలు ఎదురవుతుంటాయి. రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం ఉండదు. కానీ మండలంలో ముఠాగా ఏర్పడిన అక్రమార్కులు సులువుగా వయసు మార్పుతో నూతన ఆధార్ కార్డులను అధికారికంగా సృష్టిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వృద్ధాప్య పించన్ పొందుతున్న వారి వయసు 60 సంవత్సరాలు పైబడే ఉంటుంది. అటువంటి వారిలో అనారోగ్యంతో బాధపడుతూ చావుకు దగ్గరగా ఉన్నట్లు గుర్తించిన వారిని ఎంపిక చేసి వారి తలకు, మీసాలకు రంగు వేయించి ఆధార్ కోసం ఫొటో దింపి 55 ఏళ్లకు లోపు వయసు ఉన్నట్లు ఆధార్‌లో మార్పులు చేయిస్తున్నారు. ఇలా కొందరు వృద్ధుల పేరిట రెండు ఆధార్‌కార్డులు చెలామణిలో ఉండటం మండలంలో ఇన్సూరెన్స్ అక్రమాలను బహిర్గతం చేస్తోంది.
ఇన్సూరెన్స్‌కు దరఖాస్తుతో..
ఆధార్‌కార్డులో వయసు మార్పించిన వృద్ధుల పేరి ట వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ, ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థలలో ప్రీమియం చెల్లిస్తున్నారు. వారి పేరిట భారీ వాహనాలు కూడా కొనుగోలు చేస్తున్నారు. ఇలా ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించిన వృద్ధులు ప్రభుత్వం నుంచి వృద్ధాప్య పించన్లు పొందుతుండటం గమనార్హం. వృద్ధాప్యం పైబడటం, అనారోగ్య కారణాలతో వారు మృతి చెందిన వెంటనే వారి పేరిట ఇన్సూరెన్స్ రూ.లక్షల్లో క్లెయిమ్ చేయించుకోవడం, వారి పేరిట కొనుగోలు చేసిన వాహనాల రుణం మాఫీ చేయించుకోవడం లాంటివి అనేకం జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ దందాలో ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇలాంటి ఘటనలు తాజాగా మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోనూ వెలుగుచూశాయి. ఇల్లెందు మండలంలోనూ ఇన్సూరెన్స్ దందాపై విచారణ నిర్వహిస్తే అక్రమాలు అనేకం వెలుగుచూసే అవకాశం లేకపోలేదు. ప్రభుత్వ, ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థలు కూడా క్షేత్రస్థాయిలో సమగ్ర వివరాలు సేకరించాకే ప్రీమియం కట్టించుకోవడం, పరిహారం చెల్లించడం చేయాలని పలువురు కోరుతున్నారు.


