కుక్కను తప్పించబోయి.. | - | Sakshi
Sakshi News home page

కుక్కను తప్పించబోయి..

Oct 3 2026 12:20 AM | Updated on Oct 3 2026 12:20 AM

●డివైడర్‌ను ఢీకొట్టి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

చుంచుపల్లి: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి చెందిన సంఘటన విద్యానగర్‌ కాలనీ హనుమాన్‌ టెంపుల్‌ వద్ద ప్రధాన రహదారిపై గురువారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వేపలగడ్డకు చెందిన రొంకు సత్యనారాయణ (27) హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వర్క్‌ఫ్రం హోమ్‌లో భాగంగా స్వగ్రామానికి వచ్చిన ఆయన గురువారం రాత్రి పని నిమిత్తం కొత్తగూడెం వచ్చి తిరిగి అర్ధరాత్రి సమయంలో ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన కుక్కను తప్పించబోయి ద్విచక్రవాహనంతో డివైడర్‌ను ఢీకొట్టి కింద పడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. చేతికందిన కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు.

ట్రాక్టర్‌ టైర్‌కింద పడి చిన్నారి మృతి

గుండాల: తెల్లారుజామునే తల్లిదండ్రులు పొలం పనికి వెళ్లగా నానమ్మతో ఉన్న చిన్నారికి ట్రాక్టర్‌ టైర్ల కింద పడి మృతి చెందిన ఘటన ఇది. గుండాలకు చెందిన వాంకుడోత్‌ గణేష్‌ – రజిత దంపతులు శుక్రవా రం వేకువజామునే చేను పనికి వెళ్లారు. వీరి కుమార్తె ప్రసన్న(3) ఇంట్లో నానమ్మతో ఉంది. ఈ క్రమాన ఆమె పెద్ద నాన్న శ్రీను ట్రాక్టర్‌ తీస్తుండగా తానొస్తానంటూ మారాం చేసింది. అయితే, ఆయన ఇంట్లోకి వెళ్లాలని సూచించాడు. అయినా వినకుండా ట్రాక్టర్‌ ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని గమనించని శ్రీను ట్రాక్టర్‌ తీస్తుండగా ఒక్కసారిగా టైరు కింద పడడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృత్యువాత పడింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

1.10 కేజీల గంజాయి స్వాధీనం

ఏటూరునాగారం: గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్టు చేసి రిమాండ్‌ చేసినట్లు ములుగు జిల్లా ఏటూరునాగారం ఎస్సై మహేశ్‌ తెలిపారు. ఏటూరునాగారంలోని పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఆయ న వివరాలు వెల్లడించారు. మాదకద్రవ్యాలు, గంజాయి అక్రమంగా రవాణా విషయమై అందిన సమాచా రంతో తనిఖీలు చేపట్టామన్నారు. పలువురిని అదుపులోకి తీసుకోగా, భద్రాది కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సీతానాగారం గ్రామానికి చెందిన జగదీష్‌, రాచ్‌చరణ్‌ తేజ, ఆకుల వంశీ, వరప్రసాద్‌ వద్ద 1.10 కేజీల గంజాయి లభించడంతో కేసు నమోదు చేశామని తెలిపారు. ఇందులో వరప్రసాద్‌ నుంచి జగదీశ్‌, ఆకుల వంశీ, రామ్‌చరణ్‌ తేజ కొనుగోలు చేసినట్లు విచారణలో తేలిందని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement