నన్ను దాటి పోలేవులే! | - | Sakshi
Sakshi News home page

నన్ను దాటి పోలేవులే!

Aug 29 2026 12:58 AM | Updated on Aug 29 2026 12:58 AM

గంజాయి, ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి

రాష్ట్ర సరిహద్దుల్లో అత్యాధునిక సీసీ కెమెరాల ఏర్పాటు

భద్రాచలం నుంచి ములుగు.. కరీంనగర్‌ వరకు నిఘా

వాహనం రూపం, మార్గం మార్చినా గుర్తించే వెసులుబాటు

‘పుష్ప’ తరహా రవాణాకు చెక్‌?

భద్రాచలం అర్బన్‌: సరిహద్దు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి గంజాయి, ఇసుక రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. తెలంగాణకు సరుకు చేర్చి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధానంగా అక్రమార్కులు భద్రాచలాన్ని కీలక మార్గంగా ఎంచుకుంటుండడంతో పోలీసులు, ఈగల్‌ ఫోర్స్‌, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు నిఘా వేసినా చాలాసార్లు దారులు మార్చి మరీ తమ పని కానిచ్చేస్తున్నారు. ఈక్రమాన గంజాయి, ఇసుక అక్రమ రవాణాను సమూలంగా అరికట్టేలా పోలీసు శాఖ నిఘా కట్టుదిట్టం చేసింది. ఇందుకోసం మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న భద్రాచలంతో పాటు ఇతర సరిహద్దు జిల్లాల్లోనూ అత్యాధునిక సీసీ కెమెరాలు అమర్చే పనులు మొదలయ్యాయి.

సరిహద్దు మార్గాలే కీలకం...

తెలంగాణ – ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుకు సమీపాన ఉండే భద్రాచలం మీదుగా నిత్యం భారీగా వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. భద్రాచలం అటు ఏపీతోనే కాక ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌తో సరిహద్దు పంచుకుంటుండడంతో ఇసుక అక్రమ రవాణా విషయంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు ఒడిశా నుంచి ఈ ప్రాంతం మీదుగా గంజాయి వెల్లువలా రాష్ట్రంలోకి వస్తోంది. దీంతో గంజాయి, ఇసుక రవాణాకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర సరిహద్దులో ఉన్న కీలక ప్రాంతాలైన భద్రాచలంతో పాటు ఖమ్మం జిల్లా కల్లూరు, ములుగు జిల్లా, కరీంనగర్‌ జిల్లాలోని బావుపేట, బొమ్మకల్లు, రేణిగుంట టోల్‌ ప్లాజా వద్ద కూడా ఇదే తరహా నిఘా కెమెరాల ఏర్పాటు పనులు మొదలుపెట్టారు.

సీసీ సెంటర్‌ నుంచే

సరిహద్దు ప్రాంతాల్లో అమర్చే నిఘా కెమెరాలు నేరుగా హైదరాబాద్‌లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానమై ఉంటాయి. కెమెరాల ఫుటేజీని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ అనుమానాస్పద వాహనాలను పోలీసు విభాగం తన ‘రాడార్‌’ పరిధిలో ఉంచుకునేందుకు వీలు చిక్కుతుంది. పక్కా సమాచారం ఉంటే సదరు వాహనాన్ని సీజ్‌ చేసి అక్రమార్కులను పట్టుకునే అవకాశం ఉంటుంది. అంతేకాక ఒక ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించిన వాహనం ఏ మార్గంలో ప్రయాణించింది. ఎక్కడెక్కడ కనిపించింది అన్నది పరిశీలించే అవకాశం ఉంటుంది. అవసరమైన సందర్భాల్లో పోలీసు, రవాణా, రెవెన్యూ, అటవీ తదితర శాఖలు ఈ సమాచారాన్ని వినియోగించుకోవచ్చు.

కంటైనర్లలో ఇసుక తరలింపు

గోదావరి పరీవాహక ప్రాంతాల నుంచి ఇసుక రవాణా ఎక్కువగా ఉంటుంది. అనుమతులకు విరుద్ధంగా ఇసుక తరలించే వాహనాలపై ఇప్పటికే సంబంధిత శాఖలు నిఘా పెడుతున్నాయి. అయితే సాధారణ లారీలతో పాటు కంటైనర్లను కూడా ఇసుక రవాణాకు వినియోగిస్తున్నట్లు ఇటీవల బయటపడింది. ఈ తరహా వాహనాలను గుర్తించడం సవాల్‌గా మారిన క్రమాన... ప్రధాన మార్గాలు, టోల్‌ ప్లాజాలు, సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటుచేసే కెమెరాలు ఉపయోగపడతాయని చెబుతున్నారు.

దొంగ వాహనాలపైనా కన్ను

వాహనాలను చోరీ చేశాక నిందితులు మరో జిల్లా లేదా రాష్ట్రానికి తరలిస్తున్నారు. ప్రస్తుతం సరిహద్దుల్లో ఏర్పాటుచేస్తున్న కెమెరాల్లో వాహనాల కదలికలు నమోదైతే.. అనుమానాస్పద వాహనం ఏ మార్గంలో ప్రయాణించిందో వెనక్కి పరిశీలించే అవకాశం ఉంటుంది. దీంతో చోరీ వాహనాల తరలింపు, నంబర్‌ ప్లేట్ల మార్పు వంటి అక్రమాలపై దర్యాప్తుకు అదనపు ఆధారాలు లభించే అవకాశం ఉంది.

సినిమాల్లో చూపించినట్టుగా వాహనాల రూపం, మార్గాలు మార్చడం, తనిఖీలకు చిక్కకుండా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సరుకు తరలించే ప్రయత్నాలు వాస్తవ జీవితంలోనూ దర్యాప్తు సంస్థలకు సవాల్‌గా మారుతుంటాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు గంజాయి రవాణా వెలుగుచూస్తున్న నేపథ్యంలో భద్రాచలం మీదుగా వెళ్లే మార్గాలపై నిఘా కీలకంగా మారింది. సీసీ కెమెరాల ఏర్పాటుతో అనుమానాస్పద వాహనం ఒక ప్రాంతంలో కనిపించి.. కొంత దూరంలో మరో కెమెరా పరిధిలోకి వచ్చినప్పుడు ఆ రెండు కదలికలను అనుసంధానం చేసే అవకాశం ఉంటుంది. వాహనం మార్గం మార్చినా వివిధ ప్రాంతాల్లో నమోదయ్యే పుటేజీ ఆధారంగా పరిశీలించొచ్చు. దీంతో గంజాయి రవాణాకు వినియోగించే వాహనాలను గుర్తించడంలో కెమెరా నెట్‌వర్క్‌ కీలకంగా మారుతుందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement