భక్తిశ్రద్ధలతో హయగ్రీవ జయంతి | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో హయగ్రీవ జయంతి

Aug 29 2026 12:58 AM | Updated on Aug 29 2026 12:58 AM

భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో శుక్రవారం హయగ్రీవ జయంతి, శ్రావణ శుక్రవారం వేడుకలు జరిగాయి. తొలుత స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకీ సేవగా మిథిలా స్టేడియంలోని రామ సేవా మండపంలో కొలువుదీర్చారు. అనంతరం స్నపన తిరుమంజనం, హయగ్రీవుడికి ప్రత్యేక అభిషేకం నిర్వహించాక చిన్నారులు, విద్యార్థులకు అర్చకులు పలకలు, బలపాలను అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు విజయరాఘవన్‌, కోటి రామస్వరూప్‌ ఆధ్వర్యాన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేకాక శ్రావణ మాసం మూడో శుక్రవారం సందర్భంగా సాయంత్రం జరిగిన సామూహిక కుంకుమార్చన, లక్ష్మీ అమ్మవారి అభిషేకం, పూజల్లో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

నేటి నుంచి నిత్యకల్యాణం

రామాలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాలు శుక్రవారం ముగిశాయి. పవిత్రావరోపణం, హవనంతో స్వస్తి చెప్పారు. ఈమేరకు శనివారం నుంచి నిత్యకల్యాణాలు పునఃప్రారంభమవుతాయని వెల్లడించారు.

వైభవంగా

చండీహోమం పూజలు

పాల్వంచరూరల్‌: మండలంలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువైన శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం పౌర్ణమిని పురస్కరించుకుని చండీ హోమం, పంచామృతాభిషేకం నిర్వహించారు. తొలుత అమ్మవారికి పంచామృతంతో అభిషేకం చేశారు. ఆ తర్వాత మేళతాళాల నడుమ స్వామి వారిని ఊరేగింపుగా యాగశాలకు తీసుకొచ్చి చండీహోమం నిర్వహించగా.. అర్చకులు రమేష్‌, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్‌శర్మ, సిబ్బంది పాల్గొన్నారు.

రేపు జిల్లా స్థాయి

బెంచ్‌ప్రెస్‌ పోటీలు

పాల్వంచ: పాల్వంచలోని ఇంజనీరింగ్‌ అసోసియేషన్‌ హాల్‌లో ఈనెల 30వ తేదీన జిల్లా స్థాయి బెంచ్‌ ప్రెస్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు యూనిటీ గోల్డ్స్‌ జిమ్‌ బాధ్యులు ఎం.డీ.నూర్‌, ఎం.డీ.జాకీర్‌ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వారు మాట్లాడుతూ పవర్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో తొలిసారి పాల్వంచలో జిల్లా స్థాయి పోటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. సబ్‌ జూనియర్స్‌, సీనియర్స్‌, మాస్టర్స్‌ విభాగాలకు గాను తొమ్మిది కేటగీరీల్లో పోటీలు జరుగుతాయని చెప్పారు. క్రీడాకారులు రిజిస్ట్రేషన్‌ కోసం 99488 79786, 85018 74405 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో ఎం.డీ.అమీర్‌ఖాన్‌, ఎస్‌.కే.సల్మాన్‌ పాల్గొన్నారు.

మారెళ్లపాడు లిఫ్ట్‌

ప్రారంభోత్సవం వాయిదా

పనులు పూర్తి కాకపోవడమే కారణం

అశ్వాపురం: మండలంలోని బీజీ కొత్తూరులో సీతారామ ప్రాజెక్ట్‌ పంప్‌హౌస్‌ సమీపాన నిర్మించిన మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ పథకాన్ని శనివారం మంత్రులు ప్రారంభిస్తారని ఇప్పటికే ప్రకటించగా, లిఫ్ట్‌ నుంచి డెలివరీ పాయింట్‌ వరకు పైపులైన్‌ పనులు కొంత మిగిలి ఉండడంతో వాయిదా వేశారు. ఈ విషయమై పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పనులు పూర్తికాకపోవడంతో ప్రారంభోత్సవం వాయిదా పడిందని తెలిపారు. అంతా సిద్ధమయ్యాక రెండు, మూడు రోజుల్లో మంత్రుల పర్యటన ఉంటుందని వెల్లడించారు.

అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు ధ్యాన్‌చంద్‌ అవార్డు

ఖమ్మం స్పోర్ట్స్‌: ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌ బీజీఎన్‌ఆర్‌ కాలేజీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ భట్టు వెంకన్న రాష్ట్రస్థాయి ధ్యాన్‌చంద్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డుకు ఎంపికయ్యారు. జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డు ప్రకటించగా, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ చేతుల మీదుగా ఆయన అవార్డు స్వీకరిస్తారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మహ్మద్‌ జాకీరుల్లా, అధ్యాపకులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement