వచ్చే సీజన్‌లో పోలవరంలో నీటి నిల్వకు సన్నాహాలు
సెప్టెంబర్ 9న ఉన్నత స్థాయి సమావేశంలో చర్చ
ప్రభావం, పరిహారం, రక్షణ చర్యలపై కానరాని స్పష్టత
పోలవరం ప్రాజెక్టు మినిమం డ్రా డౌన్ లెవల్(ఎండీడీఎల్) 41.15 మీటర్ల వద్ద నీటిని నిల్వ చేస్తే ఎడమ కాల్వ ద్వారా ఉమ్మడి తూర్పుగోదావరి, విశాఖ ఏజెన్సీకి గోదావరి జలాలు తరలించే అవకాశం లేదు. కానీ కుడి కాల్వ ద్వారా ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు గోదావరి జలాలను తరలించే అవకాశం ఏర్పడుతుంది. ఇలా చేస్తే భద్రాచలం దగ్గర 28 అడుగుల ఎత్తు వరకే నీరు ఉండి బ్యాక్‌వాటర్ ముంపు సమస్య ఉండదు. అందుకే జూన్‌లో మొదలైన వానాకాలం నుంచే ఎండీడీఎల్ స్థాయిలో నీరు నిల్వ చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై చర్చించేందుకు వచ్చేనెల 9న తెలంగాణ, ఏపీ ఇరిగేషన్ అధికారులతో వర్చువల్ భేటీకి నిర్ణయించింది.
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పోలవరం ముంపు ప్రభావిత ప్రాంత ప్రజలకు ఇప్పటివరకు భరోసా దక్కలేదు. కానీ డ్యామ్‌లో నీటిని నిల్వ చేసేందుకు రంగం సిద్ధమైంది. ముంపు నష్టంపై స్పష్టత రాకముందే ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చకచకా నిర్ణయాలు జరుగుతుండడం ప్రభావిత ప్రాంత ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
రోజూ మొదటి ప్రమాద హెచ్చరికే..
పోలవరం డ్యామ్ గరిష్ట నీటి నిల్వ ఎత్తు 45.72 మీటర్లుగా ఉంది. గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేసినప్పుడు కుడి, ఎడమ కాల్వల ద్వారా ఏపీలోని పలు జిల్లాలకు సాగునీరు అందించే వీలుంది. అంతేకాక ఎగువన భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగుల స్థాయికి చేరుతుంది. ఇదే సమయాన బ్యాక్ వాటర్ స్థానిక వాగుల్లోకి చేరి భద్రాచలం, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 899 ఎకరాలు మునిగిపోతాయి. అదే విధంగా భద్రాచలం కరకట్టకు సంబంధించి ఎనిమిది స్లూయిస్ గేట్లలో మూడు స్లూయిస్ గేట్ల వద్ద ఇప్పటికే ఇబ్బందులు వస్తున్నాయి. మరోవైపు పోలవరంలో గరిష్ట స్థాయిలో నీటిని నిలిపేందుకు ‘డయాఫ్రం వాల్’ వంటి సాంకేతిక చిక్కులు అడ్డుగా ఉన్నాయి. దీంతో పోలవరం ప్రాజెక్టును తొలి, మలి దశలుగా విడగొట్టారు. తొలిదశ కింద పోలవరం డ్యామ్ మినిమమ్ డ్రా డౌన్ లెవల్ (ఎండీడీఎల్) 41.15 మీటర్లు ఎత్తులో నీటిని నిల్వ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఆందోళనలో తీర ప్రాంతం
ముంపు విషయంలో ఎలాంటి భరోసా, స్పష్టమైన కార్యాచరణ రాకుండానే తొలిదశ పేరుతో డ్యామ్‌లో నీరు నిలిపేందుకు ప్రయత్నాలు జరుగుతుండటం పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావిత ప్రాంత ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అధికార వర్గాలు కేవలం గోదావరి వరద ప్రవాహాలనే పరిగణనలోకి తీసుకుంటున్నారు తప్పితే, భారీ వరద వచ్చే సమయాన స్థానికంగా భారీ వర్షాలు కురిస్తే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమిటనేది సరిగా అంచనా వేయడం లేదనేది స్థానికుల వాదనగా ఉంది. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో పోలవరం ప్రభావిత ప్రాంతాల లెక్కను కచ్చితంగా తేల్చి, పరిహారం, రక్షణ చర్యల విషయంలో పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వాలని.. ఆ తర్వాతే నీటిని నిల్వపై ముందుకు వెళ్లాలని స్థానికులు కోరుతున్నారు.
అంతా అధికారుల వ్యవహారమే!
పోలవరం ముంపు ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు గత జూన్‌లో పీపీఏ బృందం క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చింది. స్థానికంగా వివరాలు సేకరించి వెళ్లిపోగా.. ముంపు విషయంలో కుదిరిన ఒప్పందాలు, పరిహారంపై ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ విభాగాలు, పీపీఏల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. పోలవరం ముంపు అనేది ప్రభావిత ప్రజల సమస్యగా కాకుండా ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ విభాగాలు, కేంద్ర జల సంఘంల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల వ్యవహారంగానే మారిందనే విమర్శలు వస్తున్నాయి.
పోలవరం బ్యాక్‌వాటర్‌తో భద్రాద్రికి ముప్పు


