హెచ్చరిస్తే మేలు | - | Sakshi
Sakshi News home page

హెచ్చరిస్తే మేలు

May 8 2026 11:20 AM | Updated on May 8 2026 11:20 AM

అలర్ట్‌ చేసే వారెవరు?

కల్లాలు, కేంద్రాల్లో తడిసిపోతున్న ధాన్యం, మక్కలు

అకాల, ఆకస్మిక వర్షాలతో

ఆందోళన చెందుతున్న కర్షకులు

ముందస్తుగా ‘అలర్ట్‌’ చేయాలని కోరుతున్న రైతులు

భారీగా నష్టపోతున్నాం

వర్షంతో మక్కలు తడిసిపోయాయి

సాక్షి ప్రతినిఽధి భద్రాద్రి కొత్తగూడెం: ప్రమాదం ముంచుకొస్తుందని తెలిసినా రైతులు నష్టాల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా రైతులు ఆకాశం వైపు చూసి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితిలోనే ఉన్నారు. వరదలు, అగ్నిప్రమాదాల తరహాలోనే ఆకస్మిక వానల నుంచి పంట ఉత్పత్తులను కాపాడటాన్ని డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా చేయాలని కోరుతున్నారు.

తడిసిపోతున్న ధాన్యం

జిల్లా వ్యాప్తంగా సుమారు 6.59 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. చిన్న, సన్నకారు, మోతుబరి అంతా కలుపుకుని 1.75 లక్షల మందికి పైగా రైతులు ఉన్నారు. ఇందులో రెండు పంటలు పండే వరి పొలాలు 1.80 లక్షల ఎకరాలు వరకు ఉండగా, సుమారు లక్ష ఎకరాల్లో పత్తి, మరో లక్ష ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ప్రస్తుతం యాసంగి సీజన్‌ వరి, మొక్కజొన్న పంటలు చేతికి వచ్చాయి. పంట ఉత్పత్తుల్లో సింహభాగం కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టి ఉంచారు. మండిపోతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా పడిగాపులు కాస్తున్నారు. అయితే అకాల వర్షాలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కేవలం గంట వ్యవధిలోనే ఒక్కసారిగా వాతావరణ పరిస్థితులు మారిపోవడం, అకస్మాత్తుగా వడగండ్లు, భారీ వానలు కురుస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు.

జాగ్రత్త పడతారు..

రైతు వేదికలు, వాట్సాప్‌లు, మొబైల్‌ ఫోన్లు అన్ని అందుబాటులో ఉన్నా రైతులు ఇప్పటికీ ఆకాశం వైపు చూసి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. తక్కువ సమయంలో కాపాడులేకపోతుండటంతో ఆరబోసిన ధాన్యం, మక్కలు వర్షార్పణమవుతున్నాయి. ఇక రోడ్ల వెంబడి, పొలంలో నిల్వ చేసిన ధాన్యం విషయంలో నష్టం మరింత ఎక్కువగా ఉంటోంది. ఈ తరహా ఘటనలు ఇటీవల బూర్గంపాడు, ఇల్లెందు మండలాల్లో చోటు చేసుకున్నాయి. ఆకస్మిక వర్షాలు వచ్చినప్పుడు ఆయా ప్రాంతాల రైతులను అప్రమత్తం చేస్తే.. పంట ఉత్పత్తులను జాగ్రత్త చేసుకునేందుకు ఎక్కువ సమయం అందుబాటులో ఉంటుంది. కొన్ని సమయాల్లో టార్పాలిన్లు అందుబాటులో లేకపోతే వాటిని సమకూర్చుకునేందుకు అవకాశం కూడా కలుగుతుంది. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని రైతులు అంటున్నారు.

జాతీయ స్థాయిలో నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ నుంచి భూకంపాలు, వరదలతోపాటు ఆకస్మిక వానలకు సంబంధించిన అలర్ట్‌లు ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతీ ఐదు వేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా విభజించి రైతు వేదికలు నిర్మించారు. క్లస్టర్‌లోని రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు వ్యవసాయ విస్తరణ అధికారు(ఏఈఓ)లు ఉన్నారు. వీరు ఎప్పటికప్పుడు రైతులతో టచ్‌లో ఉంటున్నారు. వాట్సాప్‌ గ్రూపులు కూడా ఉన్నాయి. నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీతోపాటు నిబద్ధత, నమ్మకం కలిగిన ప్రైవేటు వాతావరణ సంస్థలు సైతం 24 గంటల ముందే ఏ ప్రాంతాల్లో ఆకస్మిక వానలు, వడగళ్ల వర్షాలు పడతాయనే అంశంపై సమాచారం అందిస్తున్నారు. ఇలా వచ్చిన సమాచారాన్ని ఆకస్మిక వానాలు వచ్చేందుకు అవకాశం ఉన్న జిల్లాలు, అందులోని మండలాలు ఏవనేవి గుర్తించి, ఆ మేరకు రైతులను అప్రమత్తం చేసే విధానం ప్రస్తుతానికి అందుబాటులో లేదు.

వర్షసూచనల సమాచారంలేక నష్టపోతున్న రైతులు

వాతావరణంలో మార్పులను గమనిస్తూ వ్యవసాయం చేస్తుంటాం. పంట విక్రయ సమయంలోనూ అదే పరిస్థితి. కానీ వర్షం ఒక్కోసారి అకస్మాత్తుగా కురవడంతో భారీగా నష్టపోతున్నాం. స్థానిక అధికారుల నుంచి వర్షం హెచ్చరికలు ఎన్నడూ రాలేదు.

– వాంకుడోత్‌ శంకర్‌, రైతు, కొమరారం,

ఇల్లెందు మండలం

నాలుగు రోజుల క్రితం కురిసిన అకాల వర్షంతో మొక్కజొన్న బస్తాలు పూర్తిగా తడిశాయి. నేను, నా కుటుంబ సభ్యులందరం శ్రమించి 200 క్వింటాళ్లు పండించాం. అందులో సగం తడిసిపోయింది. వాన విషయం ముందుగా తెలిస్తే జాగ్రత్త పడేవాడిని.

– కమటం సూరయ్య, రైతు, మామిడిగుండాల, ఇల్లెందు మండలం

Advertisement
 
Advertisement
Advertisement