● వాతలు తేలేవరకు లాఠీతో దాడి ● విచారణకు ఆదేశించిన న్యాయమూర్తి
మధిర: కోర్టు ఉద్యోగిపై పాతకక్షను దృష్టిలో పెట్టుకొని లాఠీ విరిగేలా దాడి చేసి, తీవ్రంగా గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మధిర కోర్టులో కోర్టు ప్రాసెస్ సర్వర్‌గా పనిచేస్తున్న అంబర్ అలీ పాషా విధి నిర్వహణలో భాగంగా కొంతకాలం క్రితం మధిర రైల్వేస్టేషన్‌లో ఉన్న జీఆర్పీ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు అలీపాషాతో దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. కోర్టు పని మీద నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన తనతో అసభ్యంగా మాట్లాడుతున్నారని, తాను కూడా ప్రభుత్వ ఉద్యోగినని సమాధానం చెప్పినట్లు తెలిసింది. తననే ప్రశ్నిస్తావా అంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేయగా అలీ పాషా వాదన ఎందుకని వెళ్లిపోయాడు. కాగా, తన బంధువును రైలు ఎక్కించేందుకు శనివారం అలీ పాషా మధిర రైల్వేస్టేషన్‌కు వెళ్లి, కదులుతున్న రైలులో ఉన్న తన బంధువుకు టికెట్ కొని అందించాడు. గమనించిన వెంకటేశ్వర్లు పాత కక్షను దృష్టిలో పెట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి లాఠీతో చితకబాదినట్లు సమాచారం. ఈ విషయాన్ని బాధితుడు కోర్టు సిబ్బందికి తెలిపాడు. విషయం న్యాయమూర్తికి తెలిసి, మధిర టౌన్ సీఐ రమేశ్‌ను ఆదేశించినట్లు తెలిసింది. ఆయన ఖమ్మంలోని గవర్నమెంట్ రైల్వే పోలీస్‌కి కేసును బదిలీ చేశారు. కాగా, ఘటనపై ఖమ్మం జీఆర్పీ ఎస్‌ఐ వెంకటేశ్వర్లను వివరణ కోరగా.. బాధితుడి ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


