అడుగంటుతోంది ! | - | Sakshi
Sakshi News home page

అడుగంటుతోంది !

Mar 16 2026 7:36 AM | Updated on Mar 16 2026 7:36 AM

వారం పాటు సాగర్‌ నీరు

వైరా రిజర్వాయర్‌లో తగ్గుతున్న

నీటిమట్టం

సాగు అవసరాలతో పాటు

ఎండల ప్రభావం

జిల్లాలోని 467 గ్రామాలకు

ఇక్కడి నుంచే నీటి సరఫరా

సాగర్‌ జలాలు వస్తేనే ఉపశమనం

వైరా రిజర్వాయర్‌లోకి ప్రస్తుతం సాగర్‌ జలాలు రోజుకు 320 క్యూసెక్కులు వస్తున్నాయి. వారం రోజుల పాటు సాగర్‌ నీరు చేరుతుంది. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసి జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తాం.

– శ్రీనివాస్‌, ఐబీ, డీఈ, వైరా

వైరా: వైరా రిజర్వాయర్‌ నీటి మట్టం రోజురోజుకు తగ్గుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడు సాగు అవసరాలకు విడుదల చేస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. రిజర్వాయర్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 18.3 అడుగులు కాగా ప్రస్తుతం 13 అడుగులకు చేరుకుంది. జిల్లాలోని 11 మండలాల పరిధిలో 467 గ్రామాలకు ఈ రిజర్వాయర్‌ నుంచి రోజుకు 10 కోట్ల లీటర్ల నీటిని మిషన్‌ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ సరఫరా చేస్తున్నారు. మరో వైపు రిజర్వాయర్‌ కుడి, ఎడమ కాల్వల ద్వారా వారబందీ పద్ధతిలో ఆయకట్టుకు సాగునీరు విడుదల చేస్తున్నారు. ఏప్రిల్‌ 16వ తేదీ వరకు సాగు నీరు అందిస్తామని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. రానున్న రెండు నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనుండగా, నీటి లభ్యతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

1.6 టీఎంసీలు అవసరం

వైరా రిజర్వాయర్‌ నుంచి ప్రతీ రోజు 33 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతుండగా 37 క్యూసెక్కుల నీరు మిషన్‌ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందిస్తున్నారు. ఇలా నిత్యం 70 క్యూసెక్కుల నీరు ఖర్చవుతోంది. ఈ ఏడాది వేసవి గట్టెక్కాలంటే 1.6 టీఎంసీల నీరు రిజర్వాయర్‌లోకి రావాల్సి ఉంది. మరో వైపు జిల్లాలో ఏప్రిల్‌ 15 వరకు సాగర్‌ జలాలు వారబందీ పద్ధతిన నీరు విడుదల చేయనున్నారు. రిజర్వాయర్‌లోకి సాగర్‌ జలాలు విడుదల చేస్తే తాగునీటికి ఇబ్బందులు తప్పుతాయి. అయితే ఈ విషయమై అధికారులకు స్పష్టమైన హామీ లభించలేదు.

ముందస్తుగా మేల్కొంటేనే..

రిజర్వాయర్‌ నుంచి మిషన్‌ భగీరథ పథకం ద్వారా జిల్లాలోని వైరా, మధిర, కల్లూరు మున్సిపాలిటీలతో పాటు మరో 8 మండలాలకు 10 కోట్ల లీటర్ల తాగునీరు సరఫరా అవుతోంది. ఈ క్రమంలో రిజర్వాయర్‌లో నీటి వినియోగంతో పాటుగా ఆవిరి శాతం మరో 10 రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. వేసవి ఉధృతిని దృష్టిలో ఉంచుకుని రిజర్వాయర్‌ పూర్తి స్థాయిలో ఖాళీ కాకముందే మిషన్‌ భగీరథ, నీటి పారుదల శాఖ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేదంటే వేసవిలో గృహ వినియోగానికి తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు. రిజర్వాయర్‌లోని ప్రతికూల పరిస్థితులను బట్టి అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement