ఆకాశవాణి కేంద్రంలో ‘ఆమ్’పై అవగాహన
చుంచుపల్లి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (ఏఏఎం) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ మాట్లాడుతూ బాల్య వివాహాల నివారణ, అనీమియా ముక్త్ భారత్ కార్యక్రమాలపై వివరించారు. అనంతరం పెనగడప, విద్యానగర్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. విద్యానగర్‌లో గాయత్రి ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌ను తనిఖీ చేశారు. అధిక స్థాయిలో యాంటీబయాటిక్స్ వినియోగం ,ఖాళీ ఔషధ సీసాలు లభ్యం కావడం, నెబ్యులైజర్ పరికరాలు కలిగి ఉండటంతో నోటీసులు జారీ చేశారు
ముద్దాయికి 20 ఏళ్ల జైలు శిక్ష
● పోక్సో కేసులో న్యాయమూర్తి తీర్పు
కొత్తగూడెంటౌన్: మానసిక రోగిపై అత్యాచారం, కిడ్నాప్ చేసిన ఘటనలో బూర్గంపాడు సారపాక గాంధీనగర్‌కు చెందిన నూనవత్ నవీన్‌కు ఫోక్సో యాక్ట్ ప్రకారం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధించారు. ఈ మేరకు సోమవారం జిల్లా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి (ఫోక్సో స్పెషల్ సెషన్స్ జడ్జి ) ఎస్.సరిత తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా.. తన సోదరుడి కుమార్తె, మానసిక రోగి కనిపించడం లేదని బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన చెందిన ఇడ్డి రంగా 2019.3.19న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. బూర్గంపాడు సారపాక గాంధీనగర్‌కు చెందిన నూనవత్ నవీన్ మానసిక రోగి అయిన మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసినట్లు తేలింది. దీంతో కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. 13 మంది సాక్షులను విచారించగా నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు.
మనోవేదనతో వ్యక్తి ఆత్మహత్య
ఖమ్మంఅర్బన్: ఖమ్మం ఏడో డివిజన్ టేకులపల్లిలోని డబుల్ బెడ్‌రూమ్ సముదాయంలో నివసిస్తున్న తాళ్ల హరీష్(37) సోమవారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయనకు 15ఏళ్ల క్రితం వివాహం జరగగా ఒక కుమార్తె ఉంది. మూడేళ్ల క్రితం భార్య వదిలి వెళ్లగా, మద్యానికి బానిసైన ఆయన మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్నట్లు సోదరి నాగలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ తెలిపారు. మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సాయంతో పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
కామేపల్లి: మండలంలోని మర్రిగూడెం సమీసాన ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మృతదేహన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి మార్చరీకి తరలించినట్లు ఎస్సై శ్రీకాంత్ సోమవారం తెలిపారు. ఆయన ఆచూకీ తెలిసిన వారు 87126 59144 నంబర్‌లో కానీ పోలీసుస్టేషన్‌లో కానీ సమాచారం ఇవ్వాలని సూచించారు.
సుభాష్‌నగర్‌లో చోరీ
ఇల్లెందురూరల్: మండలంలోని సుభాష్‌నగర్‌లో ఓ ఇంట్లో చోరీ జరగ్గా, సోమవారం వెలుగుచూసింది. తోట వాణి అనే మహిళ ఇంటికి తాళం వేసి ఈ నెల 18న బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లింది. సోమవారం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి, బీరువాలోని రూ.90వేల విలువైన వెండి ఆభరణాలు అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హసీనా తెలిపారు.
ఆకాశవాణి కేంద్రంలో ‘ఆమ్’పై అవగాహన


