బొగ్గు టిప్పర్లతో ప్రమాదాలు
రవాణా ఏజెన్సీలతో చర్చిస్తాం
● భయపడుతున్న వాహనదారులు ● రెండేళ్లలో సుమారు 20 ప్రమాదాలు
రుద్రంపూర్: సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలో బొగ్గు టిప్పర్లతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. అతివేగం కారణంగా ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడుతున్నారు. సత్తుపల్లి ఏరియా పరిధిలోని జేవీఆర్‌ఓసీ, కిష్టారం ఓసీ, ఇల్లెందు ఏరియా పరిధిలోని కోయగూడెం ఓసీల నుంచి రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్(ఆర్‌పీహెచ్‌పీ)కి రోజుకు 200 నుంచి 300 లారీల బొగ్గు రవాణా జరుగుతోంది. దీంతో విజయవాడ–జగదల్‌పూర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. టిప్పర్ డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 2024, 2025 సంవత్సరాల్లో బొగ్గు టిప్పర్ల వల్ల సుమారు 20 ప్రమాదాలు జరిగాయి. 2026 జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మూడు ప్రమాదాలు జరగ్గా, ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. రామవరంలోని విద్యుత్ హైటెన్షన్ టవర్ కూడా డ్యామేజ్‌కు గురైంది. డ్రైవర్లు రెస్ట్ లేకుండా పనిచేయడం, ప్రతీ డ్రైవర్ రోజుకు 4 ట్రిప్పులు తిప్పాలనే నిబంధనలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. నాలుగు ట్రిప్పులు అనంతరం ప్రతీ ట్రిప్పునకు రూ.200 చొప్పున ఇన్సెంటివ్ ఇస్తుండటంతో డ్రైవర్లు ఎక్కువ ట్రిప్పుల కోసం మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతున్నారు. కాగా సుమారు రూ.900 కోట్లతో కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు దాదాపు 60 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ ఏర్పాటు చేశారు. బొగ్గు రవాణా కోసమే దీన్ని నిర్మించారు. అయినా మళ్లీ లారీల ద్వారానే బొగ్గు రవాణా చేస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక కోయగూడెం నుంచి ఆర్‌సీహెచ్‌పీకి బొగ్గు రవాణా చేయకుండా, అక్కడే మినీ బంకర్ నిర్మించాలని పలువురు కోరుతున్నారు.
బొగ్గు రవాణాలో టిప్పర్లతో ప్రమాదాలు జరుగుతున్న ఘటనలు మా దృష్టికి వచ్చాయి. ఆయా ఏరియాల జీఎంలు, కోల్ ట్రాన్స్‌పోర్టర్లతో మాట్లాడి టిప్పర్ల స్పీడ్‌ను నియంత్రిస్తాం. ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతాం.
– వెంకటేశ్వర్లు, డైరెక్టర్ (పీపీ)
బొగ్గు టిప్పర్లతో ప్రమాదాలు


