పసి మనసులకు ‘పరీక్ష’
గురుకుల ప్రవేశ పరీక్షకు దూర ప్రాంతాల్లో కేంద్రాలు గ్రామాల నుంచి 100 నుంచి 200 కిలోమీటర్ల ప్రయాణం ఏడెనిమిది గంటలు ప్రయాణించిన పదేళ్ల చిన్నారులు ప్రైవేటు వాహనాల్లో అర్ధరాత్రే బయల్దేరిన తల్లిదండ్రులు
దమ్మపేట : ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ప్రవేశం కోసం ఆదివారం నిర్వహించిన పరీక్ష చిన్నారులను ఇక్కట్లకు గురిచేసింది. సుదూర ప్రాంతాల్లో కేంద్రాలు కేటాయించడంతో విద్యార్థులు అవస్థ పడ్డారు. జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ గురుకులాల ఆధ్వర్యంలో పది పరీక్షా కేంద్రాల్లో ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఐదో తరగతిలో ప్రవేశానికి, ఆరు నుంచి 9 తరగతి వరకు ఖాళీ సీట్ల భర్తీకి పరీక్ష జరిపారు. జిల్లాలో 5,688 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 5,380 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 94.5శాతం హాజరు నమోదైంది. కాగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు.
తెల్లవారుజామున రెండు గంటలకే ప్రయాణం
ప్రధానంగా ఐదో తరగతిలో ప్రవేశానికి నాలుగో తరగతి విద్యార్థులు ఎక్కువ మంది పరీక్ష రాశారు. వీరంతా 10, 11 ఏళ్ల లోపు పిల్లలే. వారి స్వస్థలాల నుంచి కేంద్రాలు 100 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో కేటాయించారు. దీంతో తెల్లవారుజామున రెండు గంటలకే ప్రయాణం ప్రారంభించాల్సి వచ్చిందని తల్లిదండ్రులు చెప్పారు. కరకగూడెం, మహబూబాబాద్ జిల్లాలోని పలు గ్రామాల విద్యార్థులకు దమ్మపేట గురుకులాల్లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. చర్ల మండలంలోని విద్యార్థులకు అన్నపురెడ్డిపల్లి కేంద్రాలు కేటాయిస్తే, అన్నపురెడ్డిపల్లి విద్యార్థులకు చర్ల మండలంలో కేంద్రాలు కేటాయించారు. మిగతా మండలాల విద్యార్థులది కూడా అదే పరిస్థితి. దూరం ఎక్కువగా ఉండటంతోపాటు బస్సులు సకాలంలోలేక, ఉన్నా రెండు, మూడు బస్సులు మారి కేంద్రాలకు చేరుకోవడం కష్టంగా మారింది. కొందరు తల్లిదండ్రులు ఆర్థికభారమైనా ఆటోలను కిరాయికి మాట్లాడుకుని వెళ్లారు. కేంద్రాలకు చేరుకోవడానికి సుమారు ఆరు, ఏడు గంటల సమయం పట్టిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. అంత దూరం ప్రయాణం చేసి చిన్నారులు అలసిపోయారని, ఇక పరీక్ష ఎలా రాశారోననే ఆందోళనలో తల్లిదండ్రులు ఉన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల కోసం నీడ, కుర్చీలు, తాగునీటి సౌకర్యాలు కూడా పూర్తిస్థాయిలో కల్పించలేదు. మరోవైపు ఎండ తీవ్రత కూడా ఉండటంతో చెట్ల నీడన సేదతీరారు.
పసి మనసులకు ‘పరీక్ష’
పసి మనసులకు ‘పరీక్ష’


