అటవీ అధికారుల భిన్నవాదనలు
గుండాల: ఆళ్లపల్లి, రేగళ్ల అటవీ ప్రాంతాల్లో సంచరించిన పెద్దపులి అనంతోగు, కాచనపల్లి, కొమరారం రేంజ్ పరిధిలోకి ప్రవేశించినట్లు సమాచారం. అయితే కాచనపల్లి, కొమరారం రేంజ్ పరిధిలోకి రాలేదని సంబంధిత అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. రెండు రోజులపాటు రేగళ్ల, ఆళ్లపల్లి రేంజ్‌లలో సంచరించినట్లు స్థానిక అధికారులు పులి పాదముద్రలను గుర్తించారు. పెద్దవెంకటాపురం, లక్ష్మీపురం అటవీ ప్రాంతం నుంచి అనంతోగు వైపు వెళ్లినట్లు ఆళ్లపల్లి మండల అటవీ అధికారులు గుర్తించిన పాదముద్రల ద్వారా తెలుస్తోంది. పెద్దపులితోపాటు పులి పిల్ల కూడా సంచరిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అనంతోగు వైపు వెళ్లినట్లు ఆళ్లపల్లి మండల అటవీశాఖ అధికారులు చెబుతుండగా, అటువైపు రాలేదని కాచనపల్లి, కొమరారం రేంజ్ అధికారులు పేర్కొంటున్నారు. మరో పక్క స్థానికులు, చేను పనులకు, పశువుల మేతకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటవీశాఖ అధికారుల మధ్య సమన్వయ లోపమో లేక క్షేత్రస్థాయిలో అన్వేషణ లేకపోవడంతోనో ఒకరికొకరు పొంతన లేకుండా చెబుతున్నారు. పులి సంచరిస్తుందనే సమా చారంతో గుండాల, ఇల్లెందు, టేకులపల్లి, పాల్వంచ మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


