పెరుగుతున్న పులుల సంచారం | - | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న పులుల సంచారం

Feb 23 2026 7:08 AM | Updated on Feb 23 2026 7:08 AM

పెరుగ

పెరుగుతున్న పులుల సంచారం

● కిన్నెరసాని అభయారణ్యంలో మూడింటి కదలికలు ● గత నెల 20న అశ్వారావుపేట అడవిలో మరో పులి జాడలు ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేశాం

● కిన్నెరసాని అభయారణ్యంలో మూడింటి కదలికలు ● గత నెల 20న అశ్వారావుపేట అడవిలో మరో పులి జాడలు

పాల్వంచరూరల్‌: గతంలో ఏడాదికోసారి మాత్రమే వచ్చిపోయే పెద్ద పులుల సంఖ్య కిన్నెరసాని అభయారణ్యంలో క్రమంగా పెరుగుతున్నాయి. అభయారణ్యం పరిధిలో గతేడాది నుంచి ఓ పులి సంచరిస్తోంది. తాజాగా ఆళ్లపల్లి రేంజ్‌లో మరో రెండు పులులు సంచరిస్తున్నట్లు పాదముద్రల ద్వారా వైల్డ్‌లైఫ్‌ అధికారులు ఆదివారం గుర్తించారు. ఏపీ అడవుల నుంచి గత నెల 20న ఇదే పాల్వంచ డివిజన్‌ పరిధిలోని అశ్వారావుపేట రేంజ్‌ అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలను గుర్తించారు. ఆ పులి ఆవుపై దాడి చేసి చంపింది. దీన్నిబట్టి వలస వచ్చే పులుల సంఖ్య పెరుగుతోందని, ప్రస్తుతం నాలుగు పులులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఏటూరునాగరం నుంచి వచ్చిన

రెండు (తల్లీబిడ్డలు) పులులు

ములుగు జిల్లా ఏటూరునాగారం అభయారణ్యం నుంచి ఈ నెల 20న కిన్నెరసాని అభయారణ్యంలోకి పులులు ప్రవేశించాయి. రేగళ్ల అటవీ ప్రాంతం మీదుగా ఆళ్లపల్లి ప్రాంతంలోకి 21న చేరుకున్నాయి. చింతోనిగుంపు బీట్‌లోని లక్ష్మీపురం అటవీ ప్రాంతంలో వైల్డ్‌లైఫ్‌ సిబ్బంది పాదముద్రలు గుర్తించారు. తొలుత ఒక పులి మాత్రమే సంచరించినట్లు గుర్తించిన అధికారులు 22న కిన్నెరసాని వాగు ఒడ్డున రామాంజగుంపు వద్ద 6 సెంటిమీటర్లు కలిగిన చిన్న పులి పాదముద్రను గుర్తించారు. దీంతో పులితోపాటు పులి పిల్ల కూడా వచ్చినట్లు నిర్ధారణకు వచ్చారు. పాదముద్రల ఆధారంగా ఇది కిన్నెరసాని వాగు దాటి కాచనపల్లి మీదుగా పాకాల అటవీ ప్రాంతంలోకి వెళ్లి ఉండవచ్చని వైల్డ్‌లైఫ్‌ అధికారులు చెబుతున్నారు. తల్లి(పెద్దపులి) మాత్రం ఇక్కడే ఉందని నిర్ధారణ చేశారు. వేసవి కాలం కావడంతో చెట్ల ఆకులు రాలి నేలపై పడుతున్నాయని, ఎండు ఆకులు రాలిన ప్రాంతంలో పులి పాదముద్రలు గుర్తించడం కష్టతరంగా మారిందని అధికారులు తెలిపారు.

గణనలో గుర్తించింది ఒకటే..

కిన్నెరసాని అభయారణ్యంలో జీవవైవిధ్యంతోపాటు పులుల వృద్ధికి అనుకూల వాతావరణం ఉండటంతో శాఖాహార, మాంసాహార జంతువుల సంతతి కూడా పెరుగుతోంది. ఒకప్పుడు అభయారణ్యంలో ఐదు పులులు, 14 చిరుతలు ఉండేవి. గత నెల 19 నుంచి 26 వరకు జరిగిన పులుల గణనలో ఒక పులి మాత్రమే ఉందని అధికారులు గుర్తించారు. కానీ ఇటీవల ఘటనలతో అభయారణ్యంలో మూడు, పాల్వంచ డివిజన్‌ పరిధిలోని అశ్వారావుపేట రేంజ్‌లో ఒకటి.. మొత్తం నాలుగు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

కిన్నెరసాని అభయారణ్యంలో పులుల గుర్తింపునకు పది ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేశాం. గతేడాది నుంచి ఒక పులి సంచరిస్తోంది. తాజాగా రెండు రోజులుగా తల్లి, బిడ్డ పెద్దపులి, చిన్నపులి సంచరిస్తున్నట్లు పాదముద్రల ఆధారంగా గుర్తించాం. చిన్నపులి మాత్రం కాచనపల్లి వైపు వెళ్లగా, తల్లి పులి మాత్రం అభయారణ్యంలోనే మాటేసింది. వాటి సంరక్షణకు నిఘా పెంచాం.

–బి.బాబు, వైల్డ్‌లైఫ్‌ ఎఫ్‌డీఓ, పాల్వంచ డివిజన్‌ఽ

పెరుగుతున్న పులుల సంచారం1
1/1

పెరుగుతున్న పులుల సంచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement