సౌకర్యాలు అంతంతే!
60 మంది కార్పొరేటర్లు, అధికారులకు సరిపోని హాల్
టౌన్ ప్లానింగ్, పారిశుద్ధ్య విభాగంలో సిబ్బంది కొరత
కమిషనర్‌గా ఐఏఎస్ అధికారిని
నియమించేదెప్పుడో..?
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేసినా ఆ స్థాయిలో సౌకర్యాలు కల్పించడంలేదు. కనీసం కార్యాలయంలో కూడా పెద్దగా మార్పులు చేయలేదు. ఇటీవలే కార్పొరేషన్ నూతన పాలకవర్గం కొలువుదీరింది. కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయరు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమం పాత కౌన్సిల్ హాల్‌లోనే పూర్తి చేశారు. ఈ నెలలోనే పాలకవర్గం సమావేశం కూడా నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం 60 మంది కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది, మీడియా మొత్తం కలిసి పాలకవర్గ సమావేశానికి వంద మంది వరకు ఉండవచ్చు. పాత హాల్ వీరందరికీ సరిపోదు. పాలకవర్గ సమావేశం పాత హాల్‌లోనే నిర్వహిస్తారా? కార్యాలయం పక్కన ఉన్న పాత బిల్డింగ్ హాల్‌ను ఉపయోగిస్తారా అనే విషయమై అధికారుల్లో స్పష్టత లేదు. పాత భవనంలోని హాల్ విశాలంగా ఉందని, మరమ్మతులు చేయించి వినియోగంలోకి తేవాలని కొందరు కార్పొరేటర్లు కోరుతున్నారు. గతంలో మున్సిపల్ చైర్‌పర్సన్ వినియోగించిన రూమ్‌నే మేయర్ వినియోగిస్తున్నారు. హోదా పెరిగినా తగిన ఏర్పాట్లు చేయలేదు.
వేధిస్తున్న సిబ్బంది కొరత
కొత్తగూడెంలో కార్పొరేషన్‌కు తగిన సిబ్బంది లేరు. దీంతో ప్రజాపనుల్లో జాప్యం జరుగుతోంది. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలతోపాటు సుజాతనగర్‌లోని కొన్ని గ్రామాలను విలీనం చేస్తూ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మూడు ప్రాంతాల్లో మూడు డివిజన్ కార్యాలయాలుగా పేర్లు పెట్టుకుని పాలన సాగిస్తున్నారు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, రెవెన్యూ విభాగాల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. టౌన్ ప్లానింగ్‌లో కొత్తగూడెంలో ఇద్దరు, పాల్వంచలో ఒకరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. నిర్మాణాలు, అనుమతులపై అధికారులు, సిబ్బందికి సమాచారం ఉండటం లేదు. పారిశుద్ధ్య విభాగంలో ప్రస్తుతం రెగ్యులర్, కాంట్రాక్ట్ కార్మికులు మొత్తం 210 మంది ఉన్నారు. సిబ్బంది సరిపోక పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య పనులు జరగడం లేదు. కార్పొరేషన్ కమిషనర్‌గా ఐఏఎస్ స్థాయి అధికారి నియమాకంపై ఇంకా స్పష్టత కరువైంది. ఉన్నతాధికారులు స్పందించి ఐఏఎస్ స్థాయి అధికారిని నియమిస్తే అభివృద్ధి వేగంగా జరిగే, పాలన మెరుగుపడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కార్పొరేషన్ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. సమాధానం చెప్పే తత్వం కలిగిన కార్పొరేషన్ అధికారి లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయినా ఇక్కడి అధికారుల్లో మార్ప రావడంలేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు పెంచి కార్యాలయంలో తగిన సౌకర్యాలు కల్పించాలని, సిబ్బంది కొరతను తీర్చాలని నగర ప్రజలు కోరుతున్నారు.
కార్పొరేషన్ పాలకవర్గ సమావేశాలకు తప్పని అవస్థలు
సౌకర్యాలు అంతంతే!


