సేంద్రియ సాగుపై దృష్టి పెట్టండి
చండ్రుగొండ : రసాయన ఎరువుల వాడకం తగ్గించి పంటల్లో సేంద్రియ ఎరువుల వాడకంపై దృష్టి సారించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. మండలంలోని గానుగపాడులో బుధవారం ఆయన బయోచార్ తయారీ, వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. పత్తి కట్టెను కాల్చి పశువుల మూత్రంలో కలిపిన పేడను పంటల సేద్యంలో ఎరువుగా ఉపయోగించాలన్నారు. భూమిలో అడుగు లోతు – వెడల్పుతో గుంత తవ్వి పత్తి కట్టెను కాల్చి ఎరువుగా తయారు చేసుకోవాలని, బయోచార్ విధానం అమలులో అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరారు. వ్యవసాయంలో పెట్టుబడి తగ్గించడంతో పాటు ఏడాదికి మూడు పంటలు సాగు చేయడంతో అధిక ఆదాయం పొందాలని చెప్పారు. పంటలతో పాటు మునగ సాగు, కౌజు పిట్టల పెంపకం ద్వారా అధిక ఆదాయం వస్తుందన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ విద్యాచందన, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ బయ్యారపు అశోక్, ఏఓ వినయ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులను పాఠ్యాంశాలకే పరిమితం చేయొద్దు
పాల్వంచ: విద్యార్థులు తరగతి గదిలో పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా, బయట ఎదురయ్యే అనేక సమస్యలకు పరిష్కారాలు ఆలోచించేలా ప్రోత్సహించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. స్థానిక అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని పీఎంశ్రీ పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఇన్నోవేషన్, డిజైన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్’ బూట్ క్యాంప్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం చూపేలా ప్రాజెక్ట్‌లు రూపొందించాలని సూచించారు. అలాంటి ప్రాజెక్ట్‌లను ఉత్పత్తుల రూపంలోకి తీసుకువచ్చే దిశగా విద్యార్ధులను ప్రొత్సహించేలా ఈ బూట్ క్యాంప్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో అఖిల భారత సాంకేతిక విద్యామండలి సభ్యులు విభం వ్యాస్, వాద్వానీ ఫౌండేషన్ నిర్వాహకులు శ్యాం, డాక్టర్ హెచ్.శ్రీనివాస్ వరప్రసాద్, అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ భరత్ కృష్ణ, ప్రిన్సిపాల్ రవికుమార్, జిల్లా విద్యాశాఖ అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ.నాగరాజశేఖర్ పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్


