రమణీయంగా రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం రమణీయంగా సాగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి మూలమూర్తులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పెద్దమ్మతల్లి ఆలయంలో రేపు దుకాణాల వేలం
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని పెద్దమ్మతల్లి ఆలయంలోని పలు వ్యాపారాలకు శుక్రవారం వేలం నిర్వహించనున్నట్లు ఈఓ ఎన్.రజినీకుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త కాంప్లెక్స్‌లోని 1, 2, 3, పాత కాంప్లెక్స్‌లోని 3, 4 నంబర్ల దుకాణాలతో పాటు చీరలు పొగుచేయడం, పూలదండల విక్రయానికి లైసెన్స్ హక్కులు పొందేందుకు టెండర్ కం వేలం ఉంటుందని వివరించారు. పూర్తి వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో
‘పాలిటెక్నిక్’ ప్రతిభ
ఓవరాల్ చాంపియన్‌షిప్ కై వసం
సూపర్‌బజార్(కొత్తగూడెం): హైదరాబాద్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో రాష్ట్రంలోని పాత 10 జిల్లాల స్థాయిలో ఈనెల 2, 3 తేదీల్లో నిర్వహించిన ఆటల పోటీల్లో బాలుర విభాగంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్ కై వసం చేసుకుంది. వివిధ క్రీడా పోటీల్లో గెలిచి విజయ ఢంకా మోగించింది. బాలుర బ్యాడ్మింటన్ డబుల్స్, టేబుల్ టెన్నిస్ సింగిల్స్, డబుల్స్, డిస్కస్ త్రో విభాగాల్లో ప్రథమ స్థానం సాధించింది. బాలికల టేబుల్ టెన్నిస్‌తో పాటు, బాలుర 400 మీ.పరుగు పందెంలో తృతీయ స్థానం దక్కింది. బహుమతులు సాధించిన విద్యార్థులతో పాటు పీడీ కృష్ణారావు, ఎలక్ట్రికల్ హెచ్‌ఓడీ తారాసింగ్, లెక్చరర్లు స్వప్న, కృష్ణ, ధరణి, సిబ్బంది సందీప్, కౌసల్యను ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ బుధవారం అభినందించారు.
ఇళ్ల నిర్మాణాల్లో
వేగం పెంచండి
హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్
అశ్వాపురం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత పాటించడంతో పాటు పనుల్లో వేగం పెంచాలని హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్ అన్నారు. మండల పరిధిలోని అశ్వాపురం, గొందిగూడెం, తుమ్మలచెరువు గ్రామాల్లో బుధవారం ఆయన గృహ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు సజావుగా సాగుతున్నాయా, బిల్లుల చెల్లింపులో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తేవాలన్నారు. నిర్మాణాలు ఇంకా ప్రారంభించని వారు వెంటనే చేపట్టాలని, మార్చి 31 నాటికి పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన వారికి రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏఈలు ఉదయ్‌కుమార్, ఉదయ్‌కిరణ్, సర్పంచ్‌లు బాణోత్ సదర్‌లాల్, ఎట్టి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
రమణీయంగా రామయ్య కల్యాణం
రమణీయంగా రామయ్య కల్యాణం


