
పాల్వంచవాసికి రెండు ఉద్యోగాలు
పాల్వంచరూరల్: మండలంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు బోడ భావ్‌సింగ్, పద్మ దంపతుల కుమార్తె బోడ మౌనిక ఒకేసారి రెండు ఉద్యోగాలు సాధించింది. మహిళా, శిశు సంక్షేమ శాఖలో సీడీపీఓ, సూపర్‌వైజర్ పోస్టులకు 2022లో నోటిఫికేషన్ వెలువడగా దరఖాస్తు చేసి, పరీక్ష రాసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫలితాలు వెల్లడించగా సీడీపీఓ పోస్టుకు 26వ ర్యాంక్, సూపర్‌వైజర్ పోస్టుకు 36వ ర్యాంక్ సాధించినట్లు మౌనిక తెలిపారు. గత నెల 25వ తేదీన పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా నియామకపత్రం అందుకుంది.
పేదల పక్షాన నిలిచిన
నేత అయోధ్య
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
మణుగూరురూరల్: తుదిశ్వాస వరకు పేదల పక్షాన నిలిచిన మహోన్నత నేత బొల్లోజు అయోధ్య అని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని రామానుజవరం గ్రామానికి చెందిన సీసీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ బొల్లోజు అయోధ్యచారి ఇటీవల రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం విదితమే. మంత్రి పొంగులేటి ఆదివారం గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి అయోధ్య చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. అయోధ్యచారి రోడ్డు ప్రమాదంలో మరణించడం దురదృష్టకరని, తుదిశ్వాస వరకు ప్రజల కోసం పరితపించిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేఽశ్వర్లు, మణుగూరు డీఎస్పీ వంగా రవీందర్‌రెడ్డి, తహసీల్దార్ నరేశ్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, సీఐ నాగబాబు, నాయకులు పీరినాకి నవీన్, శివసైదులు, కూచిపూడి బాబు, సురేశ్, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ఉప్పొంగుతున్న బుగ్గచెరువు..
కరకగూడెం: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కరకగూడెం మండలంలోని పద్మాపురం బుగ్గచెరువు పూర్తిగా నిండి అలుగు పారింది. దీంతో గ్రామస్తులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో బుగ్గ చెరువు సాగునీటి వనరుగా ఉంది. వర్షాలు సమృద్ధిగా కురవడంతో చెరువులోకి భారీగా నీరు చేరి అలుగుపారుతోంది.

పాల్వంచవాసికి రెండు ఉద్యోగాలు

పాల్వంచవాసికి రెండు ఉద్యోగాలు