
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీసేవగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
నిత్యాన్నదానానికి విరాళం
దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి హైదరాబాద్‌కు చెందిన సువాణం మారుతి శ్రీకాంత్ శర్మ రూ.లక్ష చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదంతోపాటు జ్ఞాపికను దాతకు అందజేశారు. ఏఈఓ శ్రవణ్ కుమార్, వేదపండితులు పాల్గొన్నారు.