
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: శ్రావణమాసం కావడంతో అమ్మవారి దర్శనం కోసం ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వచ్చారు. క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు అమ్మవారికి విశేషపూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.
గోదావరిలో వరద ఉధృతి
దుమ్ముగూడెం : గోదావరి వరదలతో ప్రముఖ పుణ్యక్షేత్రం పర్ణశాలలో సీతమ్మవారి నారచీరల ప్రాంతం ఆదివారం నీట మునిగింది. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తోంది. దీంతో పర్ణశాలలోని నారచీరల ప్రాంతం చుట్టూ నీరు చేరింది. పర్ణశాల ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని నారచీరల ప్రాంతం దర్శించుకోకుండానే వెనుదిరుగుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరిగింది. ఆదివారం సాయంత్రం నీటిమట్టం 33 అడుగులుగా నమోదైంది.
నేడు గిరిజన దర్బార్
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే దర్బార్‌లో గిరిజనులు తమ సమస్యలపై అర్జీలను అందజేయాలని సూచించారు.
నేడు ప్రజావాణి రద్దు
సూపర్‌బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి రానున్నారని పేర్కొన్నారు. జిల్లా అధికారులంతా సీఎం టూర్ పనుల్లో నిమగ్నమై ఉన్న కారణంగా గ్రీవెన్స్ రద్దు చేసినట్లు వివరించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి దరఖాస్తులు అందజేసేందుకు కలెక్టరేట్‌కు రావొద్దని సూచించారు.
సింగరేణి క్రీడలకు నిధులేవి..?
సింగరేణి(కొత్తగూడెం): ఏరియా, రీజియన్, కంపెనీ స్థాయి, కోలిండియాస్థాయిలో క్రీడల నిర్వహణకు కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని సింగరేణి యాజమాన్యం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏటా క్రీడా పోటీల నిర్వహణకు సంస్థ నిధులు మంజూరు చేస్తుంది. ఈ సంవత్సరం కూడా జూన్‌లో బడ్జెట్ కోసం ప్రతిపాదనలు పంపారు. కానీ యాజమాన్యం పెండింగ్‌లో పెట్టింది. 2024–25లో ఆర్థిక సంవత్సరంలో రూ. 1.25 కోట్లు కేటాయించగా, సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో వర్క్ పీపుల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కమిటీల ద్వారా క్రీడా పోటీలు నిర్వహించారు. కానీ ఈ ఏడాది బడ్జెట్ కేటాయించలేదు. నిధుల్లేకుండా పోటీలు నిర్వహిస్తారని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా యాజమాన్యం స్పందించి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.
19న డీఈఎల్‌ఈడీలో స్పాట్ అడ్మిషన్లు
ఖమ్మం సహకారనగర్ : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఎల్‌ఈడీ) – 2025లో అర్హత సాధించి సీటు రాని అభ్యర్థులు ఈనెల 19న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు డైట్ కాలేజీలో నిర్వహించే స్పాట్ అడ్మిషన్లకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ బాలమురళి ఒక ప్రకటనలో తెలిపారు. 19న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్పాట్ అడ్మిషన్ల కేటాయింపు ఉంటుందని, డైట్‌లో ఇంగ్లిష్ మీడియంలో 5, తెలుగు మీడియంలో 8 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంకా మిగిలిన సీట్ల కోసం 20న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు అభ్యర్థులు హాజరు కావాలని, ప్రవేశం పొందిన వారు 21న కళాశాలలో రిపోర్టు చేయాలని సూచించారు.

పెద్దమ్మతల్లికి విశేష పూజలు