పాఠశాలకు పక్కాగా రావాల్సిందే | - | Sakshi
Sakshi News home page

పాఠశాలకు పక్కాగా రావాల్సిందే

Aug 18 2025 6:33 AM | Updated on Aug 18 2025 6:33 AM

పాఠశాలకు పక్కాగా రావాల్సిందే

పాఠశాలకు పక్కాగా రావాల్సిందే

ఎఫ్‌ఆర్‌ఎస్‌తో సక్రమంగా

హాజరవుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు

కొన్ని స్కూళ్లలో సాంకేతిక లోపాలతో అవస్థలు

త్వరలో జూనియర్‌ కళాశాలలు, ఆరోగ్య కేంద్రాల్లో కూడా అమలు

హాజరు ఇలా...

కొత్తగూడెంఅర్బన్‌: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ సిబ్బంది హాజరును ఈ ఏడాది నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్‌(ఫేస్‌ రికగ్నైజేషన్‌ సిస్టం)యాప్‌లో నమోదు చేస్తున్నారు. విద్యాశాఖతోపాటు వైద్యశాఖలో కూడా ఎఫ్‌ఆర్‌ఎస్‌ను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, పీహెచ్‌సీలకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ పరికరాలు చేరాయి. అన్ని కేంద్రాలకు పరికరాలు చేరాక హాజరును నమోదు ప్రారంభించనున్నారు. ఈ విధానం వల్ల అధికారులు, సిబ్బంది హాజరులో అవకతవకలకు తావు ఉండే అవకాశం ఉండదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. గతంలో కొందరు ఉపాధ్యాయులు పాఠశాలలకు రాకుండానే, రిజిస్టర్లలో ఇతరులతో సంతకాలు చేయించడం, పాఠశాలకు వచ్చినా సంతకం పెట్టి వెళ్లిపోవడం వంటి ఘటనలు జిల్లాలో చోటు చేసుకున్నాయి. దీంతో బోధన సక్రమంగా సాగక విద్యార్థులు నష్టపోయారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌తో అవకతవకలకు అవకాశం లేకుండాపోయింది. ఉదయం 8.30 నుంచి 9.30 వరకు సాయంత్రం 4.30 గంటలకు ఎఫ్‌ఆర్‌ఎస్‌లో చెక్‌ ఇన్‌, చెక్‌ అవుట్‌ నమోదు చేయాల్సివస్తోంది. దీంతో ఉపాధ్యాయులు పాఠశాలకు సక్రమంగా హాజరవుతున్నారు.

ప్రారంభ దశలో సాంకేతిక లోపాలు

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 2వ తేదీ నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటి నుంచీ ఉదయం, సాయంత్రం ఉపాధ్యాయులు ఎఫ్‌ఆర్‌ఎస్‌లో హాజరు నమోదు చేసుకుంటున్నారు. కొత్తగూడెం నగరంలోని కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉదయం 8.30 గంటలకు వచ్చి హాజరు పడదామని సెల్‌ఫోన్‌లో ఎఫ్‌ఆర్‌ఎస్‌ను ప్రారంభిస్తే సాంకేతిక లోపాలతో ఓపెన్‌ కావడం లేదు. దీంతోపాటు 8.30 గంటలకు ఆన్‌ చేస్తే 9.30 తర్వాత ఆన్‌ అవుతుండటం వల్ల కూడా ఉపాధ్యాయులు ఆలస్యంగా వచ్చినట్లు నమోదు అవుతోంది. ఇంకా కొన్నింటిలో చెక్‌ ఇన్‌, చెక్‌ అవుట్‌ రెండు కూడా ఒక్కసారే నమోదవుతున్నాయి. ఫలితంగా ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు లోపాలను సరి చేసి ఎఫ్‌ఆర్‌ఎస్‌ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో కూడా అధ్యాపకులు, విద్యార్థుల ఎఫ్‌ఆర్‌ఎస్‌ నమోదుకు ఆధార్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే పూర్తిస్థాయిలో కళాశాలల్లో కూడా ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు నమోదు జరుగనుంది. వైద్య, ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరుకు సంబంధించిన పరికరాలు చేర్చుతున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు గతేడాది నుంచే ఎఫ్‌ఆర్‌ఎస్‌లో నమోదు చేస్తున్నారు. ఇటీవల ఉపాధ్యాయుల హాజరు నమోదు చేస్తుండగా ఉదయం 9.45 గంటలలోగా పూర్తి కావాలి. హాజరు నమోదు చేశాక డిటెయిల్డ్‌ రిపోర్టులో హాజరు నమోదు అప్‌డేట్‌ అయ్యిందా, లేదా నిర్ధారించుకోవాలి. నమోదులో లోపాలు ఉంటే తక్షణమే సంబంధిత జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. హాజరు నమోదుపై సీఆర్పీలు, కాంప్లెక్స్‌ ఉపాధానోపాధ్యాయులు తప్పనిసరిగా పర్యవేక్షించాలని జిల్లా విద్యాధికారులు సూచిస్తున్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు సక్రమంగా హాజరవుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement