
‘పోలవరం’తో భద్రాచలానికి ముప్పు
● ఏపీ సీఎం చంద్రబాబు బ్రెయిన్, గుండె మోదీకి ఇచ్చేశాడు ● మీడియా సమావేశంలో రాజ్యసభ సీపీఎం ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిటాస్
భద్రాచలం అర్బన్: పోలవరం ప్రాజెక్ట్ కారణంగా భద్రాచల పట్టణం, పరిసర గ్రామాలను గోదావరి వరదలు ముంచెత్తుతున్నాయని సీపీఎం రాజ్యసభ ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిటాస్ అన్నారు. ప్రాజెక్ట్ పూర్తయితే బ్యాక్ వాటర్‌తో వరదల తీవ్రత మరింత పెరుగుతుందన్నారు. ఆదివారం భద్రాచలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం కాపర్ డ్యాం వల్ల ప్రజలు ఇప్పటికే గృహనష్టాలు, జీవనోపాధితోపాటు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు. ఈ సమస్యను కేంద్రం అత్యవసరంగా పరిగణించి నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. భద్రాచలం శ్రీరాముని ఆలయంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష వీడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసి ఏపీలో విలీనం చేసిన ఐదు గ్రామాలను తెలంగాణలోకి తేవాలన్నారు. స్వాతంత్య్ర వేడుకల వేదిక నుంచి ప్రధానమంత్రి ఆర్‌ఎస్‌ఎస్‌ను మాత్రమే ప్రస్తావించడం దేశ ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తోందని అన్నారు. స్వాతంత్య్ర సమరంలో కాంగ్రెస్‌వాదులు, కమ్యూనిస్టులు, రైతులు, కూలీలు, విద్యార్థులు, మహిళలు ఎందరో ప్రాణత్యాగాలు చేశారని, అనేక మంది విప్లవకారులు ఉరిశిక్షలు ఎదుర్కొన్నారని, కానీ కేవలం ఆర్‌ఎస్‌ఎస్‌నే పొగడటం చరిత్రను వక్రీకరించడమేనని పేర్కొన్నారు. ట్రంప్‌తో స్నేహం పెంచుకున్నానని చెబుతున్న ప్రధాని మోదీ.. ఆ స్నేహం దేశ ప్రయోజనాలకు ఉపయోగపడకపోతే అర్థమేమిటని ప్రశ్నించారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బ్రెయిన్, గుండె మోదీకి అప్పగించారని విమర్శించారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, నాయకులు అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్, కారం పుల్లయ్య, ఎం.బి నర్సారెడ్డి, గడ్డం స్వామి, వంశీకృష్ణ, బండారు శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.