
కిన్నెరసానిలో ‘సఫారీ’..
పాల్వంచరూరల్: రాష్ట్రంలోని అమ్రాబాద్, కవ్వాల్ అటవీ ప్రాంతాల తరహాలో జిల్లాలోని కిన్నెరసాని అభయారణ్యంలో కూడా సఫారీ ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొండకోనలు, పచ్చని చెట్లు, జలాశయం, వన్యప్రాణులు, జీవ వైవిధ్యం కలిగిన కిన్నెరసాని ప్రకృతి అందాలు అడుగుడుగునా ఆహ్లాదం పంచుతాయి. ఆ సోయగాలను ఆస్వాదించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కిన్నెరసాని అభయారణ్యంలో ఎకో టూరిజంపై దృష్టి సారించింది. సఫారీ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది.
దీపావళిలోపు ప్రారంభం
ఎత్తైన కొండల మధ్య జలాశయం, అందులో నాలుగు ద్వీపాలు ఉన్నాయి. జలాశయాన్ని ఆనుకుని గుట్టపై 9 కాటేజీలు, అద్దాలమేడల నిర్మాణం చేపట్టారు. రెండు బోట్లు ఉండటంతో రిజర్వాయర్‌లో పర్యాటకులు జలవిహారం చేస్తారు. రోజురోజుకూ పర్యాటకుల సంఖ్య పెరుగుతుండగా అటవీశాఖ అధికారులు సఫారీని అందుబాటులోకి తేనున్నారు. డీర్ పార్కు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న బేస్ క్యాంపు వరకు అభయారణ్యంలో వన్యప్రాణులను తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.45 లక్షలతో పదిమంది కూర్చునే మూడు సఫారీ వాహనాలను వైల్డ్‌లైఫ్‌శాఖ అధికారులు కొనుగోలు చేశారు. దీపావళి లోపు సఫారీ ప్రారంభించాలని నిర్ణయించారు.
అభయారణ్యంలో మరో రెండు నెలల్లో కో టూరిజం అభివృద్ధి పనులు చేపడతాం. ఈ క్రమంలో సర్వే కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. సైక్లింగ్, ట్రెక్కింగ్ వంటి సౌకర్యాలు కల్పించే ఆలోచన చేస్తున్నాం. డీర్ పార్కు నుంచి చింతోనిచెలక మీదుగా రంగాపురం, సిద్దారం వరకు సఫారీ ఏర్పాటు చేస్తాం.
–కృష్ణాగౌడ్, జిల్లా అటవీశాఖాధికారి
రూ.45 లక్షలతో
మూడు వాహనాలు కొనుగోలు

కిన్నెరసానిలో ‘సఫారీ’..