
పత్తి సాగులో జాగ్రత్తలు పాటించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): అధిక వర్షాల నేపథ్యంలో పత్తి పంటలో రైతులు జాగ్రత్తలు పాటించాలని కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి.భరత్ ఆదివారం తెలిపారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
●ప్రస్తుతం కురుస్తున్న వర్షపు నీటిని పత్తి చేనులో నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు బయటకు తీసివేయాలి
●అధిక వర్షాలు వచ్చినప్పుడు పత్తి మొక్క పెరుగుదలకు 19:19:19 పాలిఫిడ్ లేదా 13:0:45 మాల్టి–కే పోషకాలను లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
●వర్షాలు తగ్గిన తరువాత ఎకరానికి 25 కిలోల యూరియాతో పాటు 20 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ ఎరువులను భూమిలో మొక్కకు 4 అంగుళాల దూరంలో మొదళ్ల దగ్గర వేసుకోవాలి.
●పత్తి చేనులో గుంపులుగుంపులుగా మొక్కలు ఎండిపోవడం లేదా వడలిపోవడం గమనిస్తే వేరుకుళ్లు (విల్ట్) లేదా పారావిల్ట్‌గా భావించి మొక్కల మొదళ్ల చుట్టూ వేరు బాగా తడిచే విధంగా లీటరు నీటికి 2.5 గ్రాముల కార్బండిజమ్+మ్యాంకోజెబ్ కలిపిన మిశ్రమం లేదా 3 గ్రాముల కాపర్‌ఆక్సిక్లోరైడ్ మందులను పోసుకోవాలి.
●చేనులో అధిక తేమ ఉన్నపుడు ఎకరానికి 10 కిలోల యూరియాతో పాటుగా 400 నుంచి 500 గ్రాముల కార్బండిజమ్+మ్యాంకోజెబ్‌ను కలుపుకుని మొక్క మొదళ్ల దగ్గర వేసుకుంటే పారావిల్ట్‌ను తగ్గించుకోవచ్చు.
●ప్రస్తుతం వాతావరణంలో గాలి అధిక తేమతో ఉన్నందున పత్తిలో ఆల్టర్‌నేరియా ఆకుమచ్చ, ఆస్ కోకై టా బైట్ వచ్చే అవకాశం ఉంది. మల్టీ–కే లాంటి పోషకాలతో పాటుగా కాప్టాన్+హెక్సాకోనజోల్ 1.5 గ్రాములు లేదా ప్రాపికొనజోల్ 1 మి.లీ. లీటరు నీటికి కలుపుకుని పిచికారీ చేసుకోవాలి.
కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ టి.భరత్