
పొట్టకూటి కోసం వచ్చి అనంతలోకాలకు..
అశ్వాపురం: పొట్ట కూటి కోసం వచ్చిన ఓ మహిళ గుండెపోటుతో బుధవారం మృతిచెందింది. ఏపీ రాష్ట్రం బాపట్ల జిల్లా రేపల్లే మండలం పోతుమేరక గ్రామానికి చెందిన ఏమిలేని లక్ష్మి (55) అశ్వాపురం మండలం మొండికుంటలో నాటు వేస్తూ గుండెనొప్పితో కుప్పకూలింది. స్థానికులు 108లో మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. లక్ష్మికి భర్త, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ప్రత్యేక వాహనంలో లక్ష్మి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె స్వస్థలానికి తరలించారు. కాగా, లక్ష్మి మృతితో ఆమెతో వచ్చినవారు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు.
వ్యక్తి ఆత్మహత్య..
భద్రాచలంఅర్బన్: కుటుంబ కలహాలతో పట్టణంలోని శిల్పినగర్‌కి చెందిన తాతా సిద్ధయ్య మంగళవారం పురుగులమందు సేవించాడు. ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. 20 ఏళ్ల కిందట సిద్ధయ్యకు సాంబలక్ష్మితో వివాహం జరిగింది. సిద్ధయ్య మద్యానికి బానిసవ్వడంతో ఇటీవల ఇద్దరి మధ్య తగాదాలు జరుగుతున్నాయి. మంగళవారం సిద్ధయ్య మద్యంలో పురుగులమందు కలుపుకుని తాగగా.. కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో సిద్ధయ్య మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు పిల్లలున్నారు. అతని తల్లి నాంచారమ్మ ఫిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
చెట్టును ఢీకొట్టిన లారీ
ములకలపల్లి: అదుపుతప్పి లారీ చెట్టును ఢీకొట్టడంతో డ్రైవర్ మృతిచెందిన ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కిష్టారం గ్రామానికి చెందిన లారీడ్రైవర్ బీరవెల్లి కల్యాణ్‌కుమార్ సత్తుపల్లి నుంచి సారపాకకు బొగ్గు లోడుతో వెళ్తున్నాడు. మూకమామిడి క్రాస్‌రోడ్డు సమీపంలో లారీ అదుపుతప్పి రోడ్డుపక్కన చెట్టును ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన కల్యాణ్‌కుమార్‌ను 108 వాహనంలో పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుడి తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజశేఖర్ తెలిపారు.