
అక్వాడెక్ట్‌ను పరిశీలించిన కలెక్టర్
తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం మండలం రాకాసితండాలో ఆకేరుపై నిర్మించిన సీతారామ ప్రాజెక్టు అక్వాడెక్ట్‌కు అడ్డుగా బండరాళ్లు, గుట్టలు ఉండడంతో భారీ వర్షాల సమయాన వరద పోటెత్తే ప్రమాదముంది. ఈ విషయమై మంగళవారం ‘సాక్షి’లో ‘ఆకేరు అక్వాడెక్ట్‌కు అడ్డుగా గుట్టలు’ శీర్షికన కథనం ప్రచురితం కాగా ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పందించారు. ఈమేరకు మంగళవారం అక్వాడెక్ట్‌ను పరిశీలించేందుకు రాగా అడ్డుగా ఉన్న బండరాళ్లను పొక్లెయినర్‌తో తీయిస్తున్నారు. అయితే, వరద వచ్చే వరకు ఏం చేశారని ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించారు. భూసేకరణ సమస్య ఉందని అధికారులు చెప్పగా.. వరద ప్రవాహం పరిశీలనకు సీసీ కెమెరా ఏర్పాటుచేయాలని ఇరిగేషన్ డీఈ బాణాల రమేష్‌రెడ్డిని ఆదేశించారు. అనంతరం రాకాసితండా వాసులతో మాట్లాడిన కలెక్టర్ అనుదీప్ వరద పెరిగితే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని తెలిపారు. తహసీల్దార్ విల్సన్, ఎంపీడీఓ సిలార్‌సాహెబ్ ఎంపీఓ సూర్యానారాయణ పాల్గొన్నారు. అలాగే, ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి సైతం బుధవారం రాకాసి తండాను పరిశీలించిన అధికారులతో వరదపై సమీక్షించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. కూసుమంచి సీఐ సంజీవ్, తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్ పాల్గొన్నారు.
అడ్డుగా ఉన్న గుట్టల తొలగింపుపై సమీక్ష

అక్వాడెక్ట్‌ను పరిశీలించిన కలెక్టర్