
చుక్కనీరూ ఇవ్వలె..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాజీవ్‌వ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను ఒక్కటిగా చేస్తూ 2016లో సీతారామ ప్రాజెక్ట్‌ను తెరపైకి తెచ్చారు. పలుమార్లు డిజైన్లలో మార్పులు చోటుచేసుకోగా 2018 చివర నుంచి పనులు మొదలయ్యాయి. 2023 డిసెంబర్ నాటికి మూడు పంప్‌హౌస్‌లు, 104 కి.మీ ప్రధాన కాలువతోపాటు సీతమ్మసాగర్ బరాజ్‌కు సంబంధించి 24 శాతం మేరకు పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్ట్‌కు సంబంధించి డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)కు కేంద్రం నుంచి అనుమతి రాలేదు. కాగా బీఆర్‌ఎస్ హయాంలో రూ.7,500 కోట్లు పనులు జరిగాయని, అయినా ఒక్క ఎకరాకూ సాగునీరు ఇవ్వలేదని కాంగ్రెస్ విమర్శించింది. ప్రాజెక్ట్‌కు డిజైన్లలో లోపాలు, ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పేర్కొంది. తమ ప్రభుత్వ హయాంలో ఫలితాలు ఇచ్చే పనులకే నిధులు ఇస్తామని తెలిపింది.
‘రాజీవ్’తో దక్కింది భరోసానే
రూ.7,500 కోట్లు ఖర్చు చేసినా ఎక్కడా గోదావరి నీటిని వినియోగించుకున్న దాఖలాలు లేకపోవడంతో ఆగమేఘాలపై రాజీవ్ కెనాల్ రూపకల్పన చేశారు. 2024 జనవరిలో పనులు మొదలుపెడితే 2024 ఆగస్టు 15 నాటికి కాలువను పట్టాలెక్కించారు. ప్రధాన కాలువలో ప్యాచ్‌వర్క్ పనులు, వంతెనల నిర్మాణం, మూడు పంప్‌హౌస్‌ల వద్ద మోటార్లకు విద్యుత్ కనెక్షన్లు, దుమ్ముగూడెం ఆనకట్ట దగ్గర హెడ్ రెగ్యులేటరీ నిర్మాణం వంటి పనులు చకచకా చేశారు. గతేడాది, ప్రస్తుత సీజన్‌లో కృష్ణాకు సమృద్ధిగా నీరు రావడంతో నాగార్జున సాగర్ ఆయకట్టుకు గోదావరి నీటిని ఇవ్వాల్సిన అవసరం రాలేదు. అవసరమైతే నాగార్జున సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు అందించగలమనే భరోసా దక్కింది అంతే.
ప్రారంభంకాని డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులు
పంప్‌హౌస్ ప్రారంభోత్సవం సందర్భంగా 2025 ఖరీఫ్ సీజన్ నాటికి జిల్లాలో కనీసం 60 వేల కొత్త ఆయకట్టు అందుబాటులోకి రావాల్సి ఉంది. ఇందుకోసం ప్యాకేజీ 1, 2 కింద డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ఆగస్టు చివర్లో ఆమోదం వస్తే, టెండర్ల ప్రక్రియనే 2025 జనవరి దాకా జరిగింది. ఎట్టకేలకు ఈ ఏడాది జూన్ నాటికి ఒకటో ప్యాకేజీకి సంబంధించిన అగ్రిమెంట్ పూర్తయింది. రెండో ప్యాకేజీ ఇంకా టెండర్ల దశలోనే మగ్గుతోంది. దీంతో డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులు అసలు ప్రారంభమే కాలేదు. ఫలితంగా శంకుస్థాపన చేసిన తొమ్మిదేళ్లు, మోటార్లు ఆన్ చేసి ఏడాది పూర్తయినా జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా గోదావరి నీరు అందని పరిస్థితి నెలకొంది.
భద్రాచలం, పినపాకకు చేయిచ్చినట్టేనా..?
గతేడాది పంప్‌హౌస్‌ల ప్రారంభోత్సవం సందర్భంగా భద్రాచలం, పినపాక నియోజకర్గాలకు కూడా గోదావరి నీళ్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఇంతవరకు ఆ దిశగా ఒక్క పనీ జరగలేదు. సీతారామ ప్రాజెక్టు సంబంధించి ఎక్కడా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లేకపోవడం పెద్ద పొరపాటని గతేడాది మంత్రులు తెలిపారు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటివరకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణంపై ఒక్కసారి కూడా ప్రభుత్వం స్పందించలేదు. రాజీవ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు ప్రస్తుతం సీతారామ ద్వారా చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఇల్లెందు, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు పదే పదే ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేదు.
సీతారామ ప్రాజెక్ట్ పంపుహౌస్‌లు ప్రారంభించి ఏడాది
ఇప్పటికీ జిల్లాలో ఒక్క ఎకరానికీ అందని సాగునీరు
చివరి దశలో డీపీఆర్ అనుమతులు, యాతాలకుంట టన్నెల్ పనులు
చివరి అంకంలో అనుమతులు
ఏడాది కాలంగా సీతారామ డీపీఆర్‌కు కేంద్రం నుంచి అనుమతులు సాధించే ప్రక్రియలో వేగం పెరిగింది. ఇప్పటికే టెక్నికల్ కమిటీ అనుమతులు వచ్చాయి. పర్యావరణ అనుమతులు కూడా సాధిస్తే సీతారామ డీపీఆర్‌కు మోక్షం లభించినట్టే. అయితే ఏడాది పూర్తయినా పూర్తిస్థాయిలో అనుమతులు రాలేదు. అవి వస్తేనే సీతమ్మ సాగర్ బరాజ్ నిర్మాణానికి సాంకేతిక అనుమతుల అడ్డంకులు తొలగిపోతాయి. సత్తుపల్లి ట్రంక్ కెనాల్‌కు సంబంధించి యాతాలకుంట టన్నెల్ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ పనులు పూర్తయితే వచ్చే సీజన్‌కు సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకర్గాలకు నీరు అందించే పరిస్థితి ఉంటుంది. అదేఽ విధంగా ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ.13,057 కోట్ల నుంచి రూ.19,325 కోట్లకు పెంచేందుకు సర్కార్ ఆమోదం లభించింది.