
ఆలయ, పట్టణాభివృద్ధితో ప్లాన్
● భద్రాచలం దేవస్థాన మాస్టర్‌ప్లాన్‌పై సమావేశం ● చేర్పులు, మార్పులను వివరించిన స్తపతి ● భవిష్యత్ అవసరాలకు తగినట్లు ఉంటుందని కలెక్టర్ వెల్లడి
భద్రాచలం: భద్రగిరి స్థల చారిత్రక, ఆధ్యాత్మికతతోపాటు టూరిజం, సాంస్కృతిక మేలు కలయిక ఉండేలా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు ప్రముఖ స్తపతి సూర్యనారాయణ మూర్తి, కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ఇటీవల భద్రాచలం పర్యటనకు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్తపతి, దేవస్థానం వైదిక కమిటీ, అధికారులు, కలెక్టర్‌లు చర్చించి మాస్టర్‌ప్లాన్ ఫైనల్ చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో స్తపతి, కలెక్టర్, ఆలయ ఈఓ రమాదేవి, వైదిక కమిటీతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్తపతి దేవస్థాన అభివృద్ధి నమూనాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం మాట్లాడుతూ ప్లాన్‌లో దేవస్థానంతోపాటు పట్టణాభివృద్ధిని పొందుపరుస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలకు తగినట్లు మాస్టర్‌ప్లాన్ ఉంటుందన్నారు. డిజైన్ రూపకల్పనకు అందరి సలహాలు తీసుకుంటామన్నారు. ఏపీ అధికారుల సహకారంతో రాముడి భూముల పరరిక్షణకు కృషి చేస్తామన్నారు. అనంతరం ఆలయ చుట్టు పక్కల పరిశీలించారు.
ప్రధాన ఆలయంలో మార్పులు లేకుండా.. !
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూపొందించిన డిజైన్ ప్రకారం ఆలయంలో పూర్తిగా మార్పులు చేపట్టాల్సి ఉండటంతో భారీగా నిధులు అవసరం కానున్నాయి. కానీ తాజా ప్రణాళికలో ప్రధాన ఆలయానికి మార్పులు లేకుండా ఆలయం చుట్టు పక్కల ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాతి కట్టడంతో నిర్మిస్తేనే సుమారు రూ. 150 నుంచి రూ. 200 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. వైదిక కమిటీ సలహాలు, సూచనల అనంతరం కలెక్టర్ ఆమోదంతో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. ప్రభుత్వం డిజైన్ ఆమోదించాక నిధుల విడుదలపై స్పష్టత రానుంది.
తాజా నమూనాలో..
● దేవస్థాన అభివృద్ధి తాజా నమూనా గతంలో స్తపతి ఆనందసాయి రూపొందించిన నమూనాకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది.
● ప్రస్తుత నమూనా ప్రకారం రామదాసు నిర్మించిన ప్రధాన ఆలయం, ఇతర ఉపాలయాలకు మార్పులు లేకుండా, కేవలం చుట్టు పక్కల మాత్రమే అభివృద్ధి పనులను చేపట్టే అవకాశం ఉంది.
● చిత్రకూట మండపం తొలగించి, చుట్టూ స్తంభాలతో కాలి నడక మండపం ఏర్పాటు అవకాశం ఉంది.
● ప్రస్తుతం ఉన్న ఉత్తర, తూర్పు ద్వారాలకు మార్పులు చేపట్టి, దక్షిణ ద్వారాన్ని విస్తరించనున్నారు.
● గతంలో పేర్కొన్న మాఢ వీధుల ఏర్పాటు కాకుండా కేవలం చుట్టూ వీధుల పెంపు మాత్రమే ఉండనుంది.
● ఉత్తరం వైపు ప్రస్తుతం కట్టడాలు కూల్చిన ఖాళీ స్థలంలో దేవస్థాన అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం, వంటశాల ఏర్పాటు కానున్నాయి.
● క్యూలైన్ల ఆధునీకరణ, ప్రసాద విక్రయాల ఇతర పనులు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.