
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
ఎస్పీ రోహిత్‌రాజు
కొత్తగూడెంటౌన్: జిల్లాలోని వ్యాపారులు దుకాణాల ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, దొంగ సొత్తును కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. బుధవారం కొత్తగూడెం రైటర్‌బస్తీలోని ఐఎంఏ హాల్‌లో జిల్లాలోని ఆభరణల దుకాణాల యజమానులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో చోరీలను అరికట్టవచ్చని, నిందితులను గుర్తించవచ్చని పేర్కొన్నారు. చోరీకి పాల్పడిన వ్యక్తుల నుంచి బంగారం కొనుగోలు చేయొద్దని సూచించారు. దుకాణాల పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. దుకాణాల చుట్టు పక్కల నివసించే వ్యక్తుల కదలికలపై కూడా అవగాహన కలిగి ఉండాలన్నారు. వ్యాపార సముదాయాల వద్ద సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని, రాత్రి వేళల్లో గస్తీని పెంచుకోవాలని సూచించారు. ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనల దృష్ట్యా సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో భద్రాచలం ఏఏస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, ఇల్లెందు, కొత్తగూడెం మణుగూరు, పాల్వంచ డీఎస్పీలు చంద్రభాను, అబ్దుల్ రెహమాన్, రవీందర్‌రెడ్డి, సతీష్‌కుమార్, సీఐలు రమాకాంత్, కరుణాకర్, ప్రతాప్, శివప్రసాద్ పాల్గొన్నారు.